Rain Alert | గత వారం రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే తాజా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షాలపై ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ వారం వ్యవధిలో ఒకట్రెండు రోజులు మాత్రం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇవాళ మార్చి 22న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉంది.
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
బుధవారం నుండి శనివారం తెలంగాణలోని పలు జిల్లాల్లో మరోసారి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం రోజుల్లో తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
