ఘ‌నంగా రంజాన్ వేడుక‌లు.. షబ్బీర్ అలీ ఇంట్లో సీఎం రేవంత్‌రెడ్డి రంజాన్ సందడి

ఘ‌నంగా రంజాన్ వేడుక‌లు.. షబ్బీర్ అలీ ఇంట్లో సీఎం రేవంత్‌రెడ్డి రంజాన్ సందడి

విధాత : రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుక‌లను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు చిన్నా, పెద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పరస్పరం ఈద్ ముబారక్‌లతో ఆలింగ‌నం చేసుకొని శుభాకాంక్ష‌లు తెలుపుకున్నారు. మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అత్యంత ప‌విత్రంగా భావించే ఖురాన్ గ్రంధం రంజాన్ మాసంలోనే ఉద్భ‌వించిందని న‌మ్ముతారు. ఈ మాస‌మంతా ముస్లింలు క‌ఠోర ఉప‌వాస దీక్ష‌లు, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన ప్రార్థ‌న‌లు ఎంతో ప‌విత్రంగా నిర్వ‌హిస్తారు. రంజాన్‌ పర్వ‌దినం నాడు జ‌కాత్ ఫిత్రా పేరుతో పేద‌ల‌కు దాన ధ‌ర్మాలు చేస్తారు. రంజాన్ పండుగ‌ను పురస్క‌రించుకొని సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం సోద‌రులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. గురువారం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి, ప‌లువురు మంత్రులతో వెళ్లి ష‌బ్బీర్ అలీ కుటుంబ స‌భ్యుల‌తో కలిసి రంజాన్ వేడుక‌ల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ‌కీయ నేత‌లు, ప్ర‌ముఖులు రంజాన్ వేడుక‌ల్లో సందడి చేశారు. ఈద్గాల వద్ద నమాజ్‌ల అనంతరం ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.