విధాత, హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినట్లుగా భావిస్తున్న రాఘవ కంపెనీ మైనింగ్ రూల్స్ అతిక్రమణలపై హౌస్ కమిటీ వేయాలన్న బీఆర్ఎస్ డిమాండ్ పై శాసన సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
రాఘవ కన్ స్ట్రక్షన్ సహా తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కాలంలో జరిగిన మైనింగ్ అక్రమాలన్నింటిపై విచారణకు ఆదేశిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో ప్రకటించారు. నేరెళ్ల ఇసుక దోపిడీ నుంచి మొదలుకుని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులకు చెందిన సర్వే నెంబర్ 168లో శిరీషా జియో గ్రానైట్ అక్రమ మైనింగ్ లపైన, మిడ్ నట్స్ గ్రానైట్ సంస్థ అక్రమాలపైన, శ్వేత గ్రానైట్ పైన, గాయత్రి గ్రానైట్స్ పైన కూడా ప్రభుత్వం తరుపునా సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించారు. వచ్చే సమావేశాల్లో విచారణ నివేదికను పెట్టి చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సిరిసిల్ల ఇసుక మాఫియాపై సంతోష్ రావు, తండ్రి రవీందర్ రావు పై విచారణకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, గంగుల కమలాకర్ సంబంధించి ఇల్లీగల్ గ్రానైట్ మైనింగ్ పై విచారణకు సిద్ధం అని, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్ పై విచారణకు సిద్ధం అని , రాఘవ కన్స్ట్రక్షన్ తో పాటు వీటన్నింటిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నాం, విచారణలో నిజాలు నిగ్గు తేలుస్తాం అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
పదేళ్లు హరీశ్ రావు, కేటీఆర్ మైనింగ్ మంత్రులుగా ఉండి రాష్ట్ర ఖజనాకు రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇద్దరు కలిసి రూ.1000కోట్ల మేరకు దోచుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇసుక మాఫియాకు పాల్పడింది బీఆర్ఎస్ వారేనని విమర్శించారు. మా ప్రభుత్వ హయాంలో 34శాతం మైనింగ్ ఆదాయం పెరిగిందన్నారు. మా ప్రభుత్వమే రాఘవ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ఫెనాల్టీలు వసూలు చేసి, ఫిర్యాదులు చేసిన సంగతి మరువరాదన్నారు.
మంత్రిని బ్లాక్ మెయిల్ చేసే ఆటలు సాగనివ్వం
మంత్రి పొంగులేటికి, ఆ కంపెనీకి సంబంధం లేదని, మంత్రిపై బురద చల్లి బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వాటికి మా ప్రభుత్వం బయపడబోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజనాకు మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నాలు సహించబోమన్నారు. మంత్రి పొంగులేటిని బ్లాక్ మెయిల్ చేసి భూములు రాయించుకుందామని బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తుందని..అలాంటి ఆటలు సాగనివ్వబోమన్నారు. రాఘవ కంపెనీతో తనకు సంబంధం లేదని గతంలోనే మంత్రి పొంగులేటి ప్రకటించారన్నారు. పొంగులేటికి, ఆయన బంధువులకుముడిపెట్టి లొంగతీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మీలాగా ఆస్తుల కోసం, వాటాల కోసం సొంత చెల్లిని పార్టీ నుంచి గెంటేసి దోపిడి కొనసాగించే పద్దతి మాది కాదు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమాధానం తర్వాత కూడా బీఆర్ఎస్ సభ్యులు హౌస్ కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ సభకు అడ్డుపడుతూ నిరసన కొనసాగించారు. దీంతో స్పీకర్ బాలునాయక్ బిల్లుల ఆమోదం పిదప సభను ఆదివారం ఉదయం 10గంటలకు వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి :
Telangana Weather Updates : తెలంగాలో కొనసాగనున్న వర్షాలు : వాతావరణ శాఖ
Peddi | పెద్ది లో డబుల్ స్పోర్ట్స్ ట్విస్ట్ …లగాన్ చిత్రంలో మాదిరిగానే క్రికెట్‌తో పాటు కుస్తీ కూడా!
