CM Revanthreddy | నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉరుకునేది లేదు.. డీసీసీలకు సీఎం వార్నింగ్

దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సొంత ఆస్తులతో నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రారంభించి దేశ స్వాతంత్ర్యంలో గాంధీ కుటుంబం కీలకపాత్ర పోషించిందన్నారు.

CM Revanthreddy | నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉరుకునేది లేదు.. డీసీసీలకు సీఎం వార్నింగ్

విధాత, హైదరాబాద్ :

దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సొంత ఆస్తులతో నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రారంభించి దేశ స్వాతంత్ర్యంలో గాంధీ కుటుంబం కీలకపాత్ర పోషించిందన్నారు. మంగళవారం గాంధీభవన్ లో నిర్వహించిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం మాట్లాడారు.
నేషనల్ హెరాల్డ్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థికంగా నిలబడేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కృషి చేశారని తెలిపారు. ఇందులో ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధం లేదని.. నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పత్రికను నడిపారని తెలిపారు. దీనిపై మనీ ల్యాండరింగ్ కేసు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను వేధిస్తున్నారని కేంద్రప్రభుత్వాన్ని విమర్శించారు.

ఓట్ చోరీ కార్యక్రమంపై దృష్టి మరల్చేందుకు మళ్లీ కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేస్తున్నట్లు ప్రకటించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అండగా నిలబడతామని, అవసరమైతే ఎందాకైనా పోరాడతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ప్రతీ ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదేనని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, పరిపాలనపై గ్రామ గ్రామానా చర్చ పెట్టాలని సూచించారు.

సంక్షోభం నుంచి సంక్షేమం వైపు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. 2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ నెల 7 న ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెట్టి యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ యూనివర్సిటీగా తీర్చి దిద్దుతామన్నారు. కోర్ అర్బన్ లో సమస్యలను దృష్టిలో పెట్టుకుని CURE చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.

కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ బయటకు తరలిస్తామని, రీజనల్ రింగ్ లోపల ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) ప్రాంతంలో పరిశ్రమలకు ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ బయట రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ (RARE) ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణలో మరో నాలుగు విమానాశ్రయాలు, ఒక డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్-బెంగుళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు అనేది గొప్ప బాధ్యత అని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.