డేంజర్ జోన్ లో సరళాసాగర్ ప్రాజెక్ట్

♦ ఆసియా ఖండంలో మొదటి సైఫన్ సిస్టమ్ ప్రాజెక్ట్
♦ శిథిలావస్థకు చేరిన సిమెంట్ దిమ్మెలు
♦ ఏడు దశాబ్దాలుగా మరమ్మతుకు నోచుకోని సైఫన్లు
♦ ఆయకట్టు రైతుల ఫిర్యాదులూ తుంగలోకే..
♦ ఇప్పటికే సైఫన్ లకు బీటలు.. పట్టించుకోని ప్రభుత్వాలు
ప్రపంచంలో రెండోది, ఆసియా ఖండం లో మొదటి సైఫన్ సిస్టమ్ కలిగి ఉన్న సరళాసాగర్ ప్రాజెక్టు డేంజర్ జోన్ లో పడింది. మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. ఏడు దశాబ్దాల నుంచి సైఫన్ లకు మరమ్మతులు లేవు. దీంతో సైఫన్ లు బీటలు బారాయి. రైతులు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరళాసాగర్ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదు. ఆసియా ఖండంలోనే మహోన్నత కట్టడం గా పేరున్న ఈ ప్రాజెక్టును కాపాడుకునేందుకు ప్రభుత్వాల్లో చలనం లేకపోయిందని స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తొమ్మిది గ్రామాల రైతులకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు సైఫన్ సిస్టమ్ డేంజర్ జోన్ లో ఉన్నాయి.
అనకట్ట కూడా బలహీనంగా మారింది. ఇదే విషయాన్ని రైతులు పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో 2019లో ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో ఆనకట్టకు గండి పడి నీరంతా వృథాగా పోయింది. ఆ ఏడు తొమ్మిది గ్రామాల రైతులకు సాగునీరు అందలేదు. అధికారులు ఆనకట్టకు పడిన గండిని రెండేళ్ల పాటు శ్రమించి పూడ్చివేశారు. మళ్ళీ ప్రాజెక్టులోకి నీటిని వదిలారు. కానీ బీటలు పడిన సైఫన్ లకు మరమ్మతులు చేయలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టి ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయించి మరమ్మతులు చేస్తుందనే ఆశలో ఇక్కడి రైతాంగం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వనపర్తి జిల్లా పరిధిలోకి వస్తోంది.
♦ రాష్ట్రానికే వన్నె తెచ్చిన సరళాసాగర్ ప్రాజెక్టు
ఆసియా ఖండంలోనే మొదటి సైఫన్ సిస్టమ్ తో ఉన్న సరళాసాగర్ ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. అయినా ప్రభుత్వాలు గుర్తించలేదు. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టు ఒకటి ఉందని రాష్ట్రoలో చాలా మందికి తెలియదు. ఈ ప్రాజెక్టుకు గుర్తింపు తీసుకురావడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయన్న విమర్శలున్నాయి. వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజు రామేశ్వరరావు కాలంలో సరళాదేవి పేరు మీదుగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీని నిర్మాణం కోసం ఇక్కడి ఇంజనీర్లను అమెరికాలోని కాలిఫోర్నియాకు పంపించారు.
వారు అధ్యయనం చేసిన తర్వాత శంకరమ్మపేట గ్రామం వద్ద నిర్మాణం చేపట్టారు. 1949 సెప్టెంబరు 15న ఆనాటి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ జనరల్ జయంత్ నాథ్ చౌదరి చేతులమీదుగా ఊకచెట్టు వాగు మీద శంకుస్థాపన చేశారు. 0.42 టీఎంసీల సామర్థ్యంతో తొమ్మిది గ్రామాలకు సాగు నీరు అందే విధంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ముందుగా పెద్ద చెరువుగా నిర్మించారు. ఆ తరువాత ఆధునీకరించి 1959 జూలై 26న ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. 1964 సెప్టెంబరులో కుడివైపు గండి పడితే కొంత భాగాన్ని రాతితో ఆనకట్ట పునర్నిర్మించారు. కాలక్రమేణా బుర్ర వాగుతో పాటు మరికొన్ని వాగుల నుంచి వచ్చే నీటి ప్రవాహాలు… అనావృష్టి కారణంగా ఆగిపోయాయి.
దీంతో సరళా సాగర్ ప్రాజెక్ట్ కు నీరు రాక మరుగునపడిపోయింది. వర్షాధార ప్రాజెక్టు కావడంతో నీటి సమస్యను అధిగమించడానికి, నిరంతరం నీటితో ఉండటానికి ప్రాజెక్టుకు మళ్ళీ కొత్తగా రూపకల్పన చేశారు. 2008లో అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, వనపర్తి ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి స్పందించారు. ఈ ప్రాజెక్టుకు వెనుక భాగంలో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్ పాడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా రూ.12 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ ఎత్తిపోతలతో ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉండేది. రానురాను ప్రాజెక్ట్ పర్యవేక్షణ కొరవడింది. దీంతో 2019 డిసెంబరు 31న ఉదయం సరళా సాగర్ ఆనకట్టకు ఎడమవైపు భారీ గండిపడింది.
ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2020 ఆగస్టు నాటికి గండిని పూర్తిగా పునరుద్ధరించారు. ఆనకట్ట బలంగా లేదని రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో చివరకు ఆనకట్టకు గండి పడడంతో అధికారులు, నేతలు కళ్ళు తెరిచారు. ముందుగానే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు అప్పట్లో అధికారులపై ఆగ్రహం చెందారు. అప్పటి దేవరకద్ర బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చర్యలు తీసుకుని అధికారులపై వత్తిడి తెచ్చి ఏడాదిన్నర పాటు పనులు చేసి గండిని పూడ్చివేశారు. కానీ సైఫన్లు బీటలు పడ్డాయని రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. సైఫన్ లు కూడా పూర్తిగా ధ్వంసమైన తరువాత మళ్ళీ కొత్తగా నిర్మిస్తారో అని అధికారుల తీరును రైతులు హేళన చేస్తున్నారు.
♦ సైఫన్ సిస్టమ్ అంటే..
ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న సైఫన్ సిస్టమ్ ప్రాజెక్టుల్లో సరళాసాగర్ రెండోది. ఈ సిస్టమ్ లో ప్రాజెక్టుకు గేట్లు ఉండవు. సిమెంట్ దిమ్మెల మాదిరిగా ఏనుగు తొండం ఆకారం వచ్చే విధంగా వీటిని ప్రాజెక్టు ఆనకట్ట మధ్యలో నిర్మించారు. ప్రాజెక్టు సామర్థ్యం కన్నా నీరు ఎక్కువగా వచ్చిన సమయంలో ఆటోమెటిక్ గా ఈ సైఫన్లు తెరుచుకుని నీటిని బయటకు తోడేస్తుంటాయి. ఈ సరళాసాగర్ ప్రాజెక్టుకు ఏడు సైఫన్లు నిర్మించారు.
ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1089 అడుగులు కాగా, 1089.25 అడుగులకు నీరు వస్తే కొన్ని సైఫన్లు ఆటోమెటిక్‌గా తెరుచుకుంటాయి. 1095 అడుగులకు నీరు చేరితే ప్రాజెక్టులో అన్ని సైఫన్లు తెరుచుకుని నీటిని బయటకు పంపుతాయి. ఇదంతా మ్యాన్ పవర్ అవసరం లేకుండా ఆటోమెటిక్ గా పనిచేస్తాయి. ఈ సైఫన్ సిస్టమ్లో ఎలాంటి మిషన్ పరికరాలు ఉండవు. పూర్తి నిర్మాణంలో సిమెంట్ దిమ్మలే వాడి ఈ సిస్టమ్ ను తయారు చేశారు.
♦ 1960లో మొదటిసారిగా తెరచుకున్న సైఫన్లు
నీటి ఉధృతి తట్టుకునే ఈ సైఫన్ లు ప్రాజెక్టులోకి సామర్థ్యానికి మించి నీరు వస్తే ఎలాంటి హెచ్చరిక లేకుండా ఆటోమెటిగ్ గా సైఫన్లు ఓపెన్ అవుతాయి. ఇలా చాలా సమయాల్లో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1960 లో మొదటిసారిగా సైఫన్లు తెరచుకున్నాయి.