Nalgonda : పిల్లల అమ్మకం కేసులో ఏడుగురి రిమాండ్..ఇద్దరు శిశువుల క్షేమం

నల్లగొండలో ఇద్దరు శిశువులను (10 రోజుల పాప, 21 రోజుల బాబు) అమ్మిన కొనుగోలు చేసిన కేసులో డాక్టర్‌తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. శిశువులను శిశుగృహానికి తరలించారు. అక్రమ దత్తత తీవ్ర నేరం అని ఎస్పీ హెచ్చరిక.

Nalgonda : పిల్లల అమ్మకం కేసులో ఏడుగురి రిమాండ్..ఇద్దరు శిశువుల క్షేమం

విధాత : పిల్లల అమ్మకం..కొనుగోలు వ్యవహారంలో నల్లగొండ జిల్లా పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లుగా నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నల్లగొండ పట్టణంలో రెండు రోజుల క్రితం 10రోజుల ఆడశిశువును, 21 రోజుల మగ శిశువుని రక్షించి శిశుగృహానికి అప్పగించినట్లుగా తెలిపారు. మధ్యవర్తిత్వం చేసిన డాక్టర్, మరొక వ్యక్తిపై కేసు నమోదు చేసి, రిమాండ్ చేశామని, అరెస్టు చేసిన వారి దగ్గర నుండి 20 వేల రూపాయల నగదు, ఏడు సెల్ ఫోన్లు, అగ్రిమెంట్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా మైనర్ పిల్లలను అమ్మడం, కొనడం, దత్తత తీసుకోవడం, మధ్యవర్తిత్వం వహించడం తీవ్ర నేరం ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. ఎక్కడైనా గ్రామాలలో గాని, వార్డులలో గాని, తండాలలో గాని ఆడపిల్లలను ఎవరైనా అమ్మడం, కొనడం, దత్తత తీసుకోవడం, అబార్షన్ చేయడం గానీ చేస్తున్నట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కి గాని, జిల్లా పోలీస్ కార్యాలయంకు లేదా ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందజేయాలని సూచించారు.

నల్లగొండ పట్టణంలో రెండు రోజుల క్రితం 10 రోజుల బేబీని, 21 రోజుల బాబును అక్రమంగా దత్తత చేసుకున్నారన్న విషయంలో ఈ నెల 27, 28తేదీలలో నల్గొండ వన్ టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేసుకొని విచారణ చేపట్టడం జరిగిందని ఎస్పీ వివరించారు. మూడు బృందాలుగా ఏర్పడి, అక్రమ దత్తత ఇచ్చిన కుటుంబ సభ్యులను గుర్తించి, దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులను, మధ్యవర్తిత్వ డాక్టర్ , మరొక వ్యక్తిని పట్టుకుని వారి వద్ద నుండి శిశువులను రెస్క్యూ చేసి శిశు గృహానికి అప్పగించడం జరిగిందని తెలిపారు.

మొదటి కేసు వివరాలు

మొదటి కేసులో తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపూర్ కు చెందిన కుర్రబాబు, పార్వతి దంపతులు నల్లగొండ బీటీఎస్ లో ఉంటున్నారు. వారికి మొదట మగ పిల్లగాడు పుట్టి చనిపోగా,తర్వాత ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. మళ్లీ ఒక ఆడపిల్ల పుట్టి 2 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. తిరిగి 15 రోజుల క్రితం బాబు పుడతాడు అనుకుని, హాలియాలోని నిర్మల హాస్పిటల్ లో పార్వతిని అడ్మిట్ చేయగా మళ్ళీ ఆడపిల్ల పుట్టేసరికి ఆడపిల్లను సాకడం భారమవుతుందని అదే హాస్పిటల్ లో పనిచేస్తున్న శాంతి ప్రియా అనే డాక్టర్ ను సంప్రదించారు. ఆమె మధ్యవర్తిత్వం వహించి 16సంవత్సరాలుగా పిల్లలు లేని ఏలూరుకు చెందిన సాంబమూర్తి , రజిత దంపతులకు ఆడబిడ్డ సమాచారం అందించింది. ఈ నెల 25న సాయంత్రం 7 గంటల సమయంలో నల్గొండ బస్టాండ్ రైల్వే స్టేషన్ పోవు దారి మద్యలో రోడ్డు దగ్గరికి వచ్చి కుర్ర బాబు, అతని భార్య పార్వతి దగ్గర నుండి పాపను రూ.2 లక్షల 30 వేల రూపాయలకు అక్రమ దత్తత ఒప్పందం కుదుర్చుకొని, అడ్వాన్సుగా పదివేల రూపాయలను ఇచ్చి ఆడ శిశువును తీసుకెళ్లారు. శిశువు హెల్త్ చెకప్, లీగల్ ప్రాసెస్ పూర్తి చేసి మిగతా డబ్బులను ఇచ్చే విధంగా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ కేసును నిందితులందరిని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు.

రెండవ కేసు వివరాలు

రెండో కేసులోర్రంపోడు మండలం కోనాయిగూడెంకు చెందిన ఒర్సు శ్రీను, భార్య సుజాతలకు ముగ్గురు పిల్లలు. ఆతర్వాత మొదటి భార్య, ఆమె పిల్లలతో దూరంగా ఉంటున్న శ్రీను 6 సంవత్సరాల క్రితం ఒడిస్సా కు మట్టి పని నిమిత్తం వెళ్ళి అక్కడ మమత(జంకర్ మాలా)ని రెండో భార్యగా వివాహం చేసుకోగా..ఆమెకు ఒక బిడ్డను జన్మించింది. ఇటీవల మరల తను గర్భందాల్చగా గత రెండు నెలల క్రితం ఒర్సు శ్రీను, భార్య మమత ఒడిస్సా నుండి సొంతూరు కోనాయిగూడెం కు వచ్చారు. అప్పటికే మమత 8 నెలల గర్భవతి. వారు ఇద్దరు ఎలాగైనా తమకు పుట్టబోయే బిడ్డను ఎవరికైనా అమ్మి సొమ్ము చేసుకొని తిరిగి ఒడిస్సా వెళ్ళిపోదాం నిర్ణయించుకున్నారు. తమకు పుట్టబోయిన బిడ్డను ఎవ్వరికీ అమ్మేందుకు నెల రోజుల క్రితం దూరపు బందువు ఓర్సు శ్రీను కొనాయిగూడెంకు చెందిన శ్రీను, వేముల నాగరాజు, సువర్ణలు కలిశారు.ఈ నెల 8న నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒర్సు మమతా డెలివరీ కాగా ఆమెకు మగ బిడ్డ జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఓర్సు శ్రీను వెంటనే నాగరాజు, సువర్ణ, శ్రీనులకు తెలిపాడు. రూ. 6లక్షలకు మగ బిడ్డను అమ్ముతానని ఓర్సు శ్రీను చెప్పగా..చివరకు రూ.4.5లక్షలకు ఒప్పందం చేసుకొని..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ రోజున వచ్చి డబ్బులు కట్టి బిడ్డను తీసుకొని వెళ్లారు. తిరిగి ఈ నెల 15వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చిన ఒర్సు శ్రీను, మమతలకు రూ. 4.5 లక్షల రూపాయలు ఇచ్చి మగబిడ్డను తీసుకెళ్లారు. ఈ కేసులోనూ నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లుగా ఎస్పీ వెల్లడించారు.