సింగరేణికి చేరిన నైనీ బొగ్గు

ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు తొలి బొగ్గు రైలు చేరింది. 59 వ్యాగన్లలో 4 వేల టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గు రవాణా జరిగింది.

ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఎస్ టీపీపీ(సింగరేణి థర్మల్ కేంద్రం)కి తొలి బొగ్గు రైల్వే రేకు గురువారం చేరుకుంది. మంచిర్యాల జిల్లా జైపుర్‌ సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రానికి బొగ్గు రైలు చేరుకొంది. నైనీ గని నుంచి బయలుదేరిన తొలి రైలు 1,131 కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణ గడ్డపైకి చేరుకుంది. అందులో 59 వ్యాగన్ల ద్వారా 4వేల టన్నుల జీ-10 గ్రేడ్‌ బొగ్గు వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓ వీడియో రిలీజ్ చేశారు. సింగరేణి యాజమాన్యం, కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సింగరేణి చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కరించిందన్నారు. సింగరేణికి నైనీ బొగ్గు రవాణా చరిత్రాత్మకం అని, సింగరేణి గనుల విస్తరణ చరిత్రలో ఇది మరో మైలురాయి వంటిదని అభివర్ణించారు.

నైనీ బొగ్గు గనీతో పాటు తాడిచర్ల బొగ్గు గని కూడా సింగరేణి నిర్వహిస్తుందని గుర్తు చేశారు. మైనింగ్ లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సింగరేణి సంస్థ మైనింగ్ రంగంలో మరిన్ని కీలక ప్రాజెక్టులు చేపట్టనుందని తెలిపారు.

కేంద్ర బొగ్గు శాఖ 2015 ఆగస్టు 13న సింగరేణికి కేటాయించిన నైనీ గని మొత్తం 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ గని జీవితకాలం 36 సంవత్సరాలు కాగా, ఏడాదికి కోటి టన్నుల (10 మిలియన్ టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో నడవనుంది. నైనీ నుంచి నాణ్యమైన బొగ్గు రాకతో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిలో ఇకపై ఎలాంటి ఆటంకాలు ఉండవని, భవిష్యత్తు తరాలకు నిరంతర ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest News