CM REVANTH REDDY | కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే అవకాశం…సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

రాబోయే రోజుల్లో కొందరు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలు రద్దయ్యే అవకాశాలు లేకపోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సభలో బహిష్కరణలు, సస్పెన్షన్లు, మార్షల్స్ అవసరం రావద్దని మా ఆలోచన.

CM REVANTH REDDY | కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే అవకాశం…సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

మోసానికి పర్యాయపదమే సబితా ఇంద్రారెడ్డి
సునీత కోసం కేసులపాలయ్యాను
ఆమె పార్టీ మారి పదవులు పొందారు
ప్రజాస్వామ్యయుతంగా సభను నడిపిస్తున్నాం
గతం కంటే ఎక్కువ సేపు విపక్ష సభ్యులే మాట్లాడారు
సభకు రాని కేసీఆర్‌కు ఫ్లోర్ లీడర్ పదవి దండగ
అధికారం లేకపోతే ప్రజలు వద్దన్న ధోరణితో కేసీఆర్‌
మీడియా చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : రాబోయే రోజుల్లో కొందరు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలు రద్దయ్యే అవకాశాలు లేకపోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సభలో బహిష్కరణలు, సస్పెన్షన్లు, మార్షల్స్ అవసరం రావద్దని మా ఆలోచన. అలాంటి అవసరం, సందర్భం వస్తే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావొచ్చు. గతంలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు చేశారు. గతంలో నన్ను ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. నా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని నేను హైకోర్టులో పిటిషన్ వేశాను. ఏదైనా సమయం, సందర్భాన్ని బట్టి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం సభలో తాను చేసిన వ్యాఖ్యలపై జరిగిన రగడపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు. మాజీ మంత్రి, బీఆరెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మోసానికి పర్యాయపదమని తమ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల కంటే మించిన సమాధానం ఏముంటుందని రేవంత్‌రెడ్డి అన్నారు. అక్కలను నమ్ముకోవద్దంటూ సభలో తాను చేసిన వ్యాఖ్యలపై బీఆరెస్‌ రాజకీయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కాంగ్రెస్‌లోకి రమ్మని చెప్పిన అక్క సబితమ్మ తనకు మల్కాజిగిరి టికెట్ ఇవ్వగానే బీఆరెస్‌లో చేరిపోయి, మంత్రి పదవి పొందారని చెప్పారు. పార్టీలోకి రమ్మని చెప్పిన అక్క తమ్ముడికి తోడు ఉండాలి కదా? అని వ్యాఖ్యానించారు. అక్క బాధ్యతగా తమ్ముడి కోసం నిలబడాలని కానీ.. మరో పక్క నిలబడిందని అన్నారు. ఇక సునీత లక్ష్మారెడ్డి కోసం నర్సాపూర్‌లో 2018లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తే తనపై రెండు కేసులు నమోదు చేశారని తెలిపారు. ఇప్పటికీ ఆ కేసుల్లో తాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పారు. ఆమె మాత్రం బీఆరెస్‌లోకి వెళ్లిపోయి మహిళా చైర్ పర్సన్ పదవి తీసుకున్నారని విమర్శించారు. కేసులు నాకు, పదవులు వాళ్లకు అన్నట్లుగా మారిందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా సభ

ప్రజాస్వామ్యబద్ధంగా సభ నడుస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క రోజే 17గంటల పాటు సభ నడిచిందని చెప్పారు. బుధవారం రాత్రికల్లా బడ్జెట్ ఆమోదం పొందాల్సిన పరిస్థితి ఉన్నందునే ఆమోదం తెలిపామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా బడ్జెట్‌పై ఇంత చర్చ జరగలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. సభలో గతంలో కంటే ప్రతిపక్ష సభ్యులకే ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి మొత్తంగా 6 గంటలు మాట్లాడారని వెల్లడించారు. సబితా ఇంద్రారెడ్డికి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. బడ్జెట్‌పై చర్చలో సభకు కేసీఆర్, హరీశ్‌రావు ఎందుకు డుమ్మా కొట్టారని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్, హరీశ్‌ రావు అండగా నిలబడాలి కదా అని వ్యాఖ్యానించారు. శాసన సభలో చర్చకు తాము చాలని కేటీఆర్‌, హరీశ్‌ చెబుతున్నారని, అలాంటప్పుడు ఫ్లోర్ లీడర్‌గా కేసీఆర్ ఎందుకని ప్రశ్నించారు. ఆ స్థానంలో కేటీఆర్ ఉండొచ్చు కదా! అని ఎద్దేవా చేశారు. బాధ్యత లేని వ్యక్తి కేసీఆర్ అని, అధికారం లేకపోతే తనకు ప్రజలు అవసరం లేదు అన్నట్లు ఆయన వైఖరి ఉందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. సభలో గందరగోళం సృష్టించేందుకే కేటీఆర్ వస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరిన గద్వాల, భద్రాచలం ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు అసెంబ్లీ హాల్‌లో కేటీఆర్‌ను కలవడం సాధారణ అంశమేనని కొట్టిపారేశారు. తన దగ్గరకు 10 మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేలు వచ్చి కలిశారని, అట్లాగే ఎమ్మెల్యే బండ్ల కూడా చాయ్ తాగడానికి వెళ్లారని అన్నారు.