Takkallapally Srinivasa Rao | వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి .. సీపీఐ రాష్ట్ర నేత తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
వరంగల్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

విధాత, వరంగల్ ప్రతినిధి:వరంగల్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ లో ప్రవేశ పెట్టడంపై ఆయన స్పందిస్తూ గత ప్రభుత్వం వరంగల్ కు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వరంగల్ నగరాభివృద్ధికి, విలీన గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం పదివేల కోట్లను కేటాయించినట్లే తెలంగాణకు రెండవ రాజధానిగా ఉన్న గ్రేటర్ వరంగల్ కు కూడా కేటాయించాలన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలలోని ములుగు, భూపాలపల్లి లాంటి వెనుకబడిన జిల్లాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కంతనపల్లి ప్రాజెక్టు ను గత ప్రభుత్వం మూలన పడేసిందని, నిర్వీర్యం చేసిందని అన్నారు. ఈ ప్రభుత్వం అయినా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం కోసం కంతనపల్లిని చేపట్టి పూర్తి చేయాలని కోరారు. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 100 కోట్లను కేటాయించారని, కాకతీయ యూనివర్శిటీకి కూడా అదే స్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు.