26 జూన్ 2027 నుంచి 7 జూలై 2027 వరకు గోదావరి నది తీరం పుష్కర శోభతో విరాజిల్లేలా, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని గోదావరి పుష్కరాల పై ఏర్పాటు చేసిన కేబినేట్ సబ్ కమిటి సంకల్పించింది. గోదావరి పుష్కర ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి డి. శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేబినేట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల పనుల పురోగతిని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. వీలుకాని పక్షంలో వర్చువల్ మీటింగ్ ల ద్వారా పనులను సమీక్షించాలని సూచించారు. గోదావరి పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక కార్యక్రమంగా భావిస్తున్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.
గోదావరి నదీ తీరాన వున్న నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పుష్కర ఘాట్లుగా తీర్చిదిద్దనున్న మొత్తం 67 కేంద్రాలను 3 అంచెల్లో అభివృద్ధి చేయనున్నట్లు కమిటి కన్వీనర్, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ మంత్రుల బృందానికి వివరించారు. గోదావరి పుష్కరాల సమగ్ర ఏర్పాట్ల కోసం రూ. 1000 కోట్లతో వివిధ శాఖల పరిధిలో పనులు జరుగుతున్నట్లు వివరించారు.
పుష్కరాల సందర్భంగా గోదావరి తీరం వెంబడి ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేసి, దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు డ్యాష్‌బోర్డు ద్వారా సమీక్షించేందుకు వీలుగా, శాఖల వారీగా చేపడుతున్న పనులు, పురోగతి తదితర వివరాలు అందుబాటులో ఉండేలా డ్యాష్‌బోర్డును రూపొందించాలని అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు. గోదావరి పుష్కరాల నిమిత్తం స్పెషల్ ఫండ్స్ కావాలని పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వినతుల వస్తున్నందున ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి తీర ప్రాంతం సుదీర్ఘంగా వున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గోదావరి పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించాలని సూచించారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు ఎంచుకున్న ప్రాంతాల్లో ఆయా క్షేత్రాల మహాత్మ్యాన్ని, చారిత్రక–ఆధ్యాత్మిక విశిష్టతను తెలియజేసేలా స్వాగత ద్వారాలు, ప్రత్యేక అలంకరణలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆయా క్షేత్రాల విశిష్టతను పరిచయం చేసేలా సమాచార బోర్డులు, దృశ్యరూప ప్రదర్శనలు ఏర్పాటు చేసి, గోదావరి పుష్కరాల వైభవం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు పనులు పునరావృతం కాకుండా సమన్వయంతో చేయాలని సూచించారు.
భక్తులకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స అందించడానికి వైద్యారోగ్య శాఖతో పాటు ముందుకు వచ్చే ప్రైవేట్ హాస్పిటళ్ళ సహకారం తీసుకోవాలని మంత్రి వైద్యారోగ్య శాఖకు సూచించారు. అనంతరం భక్తులు పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు నిర్వహించడంతో పాటు కొబ్బరికాయలు కొట్టడం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఈ సందర్భంగా ప్లాస్టిక్ కవర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు గోదావరి జలాల్లో కలవకుండా భక్తులకు అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని, జలాల్లో కలిసిన ప్లాస్టిక్ వస్తువులను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ సూచించారు.
గోదావరి పుష్కరాలకు లక్షలాదిగా యాత్రికులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. విఐపి, వివిఐపిలకు ప్రత్యేకంగా బారికేడ్స్ , స్నానఘట్టాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన తోపులాట అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ శాఖ అధికారులు మంత్రులకు వివరించారు. ఐ అండ్ పిఆర్ తరఫున ప్రచార కార్యక్రమాలను గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందు నుంచే ప్రారంభించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డికి సూచించారు.
గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందే గోదావరి నదీ తీరంలోని భద్రాచలం, ధర్మపురి వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పుష్కర ఏర్పాట్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించారు. పుష్కరాల సమయంలో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక బస్ షెల్టర్లు, ప్రయాణికుల వెయింటింగ్ ఏర్పాట్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలను తీర్చిదిద్దాలని, శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్లు లేని ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టేషన్లు, ప్రయాణికుల హోల్డింగ్ ఏరియాలు, పార్కింగ్ సదుపాయాలు తదితర ఏర్పాట్లను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టిసి అధికారులకు నిర్దేశించారు. గోదావరి పుష్కరాలను ప్రతిబింబించేలా బస్ స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను ముందుగానే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఘాట్లు, గ్రామాల పరిసరాల్లో పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, పుష్కరాల కాలం పూర్తయ్యే వరకు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు అవసరమైన సిబ్బంది, వనరులను అందుబాటులో ఉంచాలని అన్నారు. పుష్కరాల ఏర్పాట్లలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
