బీఆరెస్‌కు కుంగుబాటు?

- ఎన్నికల వేళ పెను సంచలనం
- కాళేశ్వరంపై కాంగ్రెస్ ఆరోపణలు
- ముఖ్యమంత్రి కేసీఆర్‌దే బాధ్యత
- మండిపడుతున్న ప్రతిపక్షాలు
- కేంద్ర సంస్థల తనిఖీకి డిమాండ్
- ఉదయం నుంచే కుంగుదల?
- రాత్రికి ఎవరో చెప్తేకానీ తెలియలే
- పేలుడు వంటి శబ్దం వచ్చింది
- ప్రాజెక్టు ఈఈ తిరుపతిరావు వెల్లడి
- బరాజ్‌పై నిత్యం సిబ్బంది పహారా
- మసిబూసేందుకే బాంబు వాదన!
- మహదేవపూర్ స్టేషన్‌లో ఫిర్యాదు!
- ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల స్కీం
- రిటైర్డ్ ఇంజినీర్ లక్ష్మీనారాయణ
నదిని ఎత్తిపోశారని బీబీసీల్లో ప్రచారాల పరవళ్లు! కేసీఆర్ ఇంజినీరుగా మారి కట్టించారని కితాబుల ఎత్తిపోతలు! ఇంజినీరింగ్ అద్భుతమంటూ టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శనా ప్రవాహాలు! నదికి ఎదురీత నేర్పారంటూ వరదలై పొంగిన కవిత్వాలు! తీరా చూస్తే.. మహాద్భుత కట్టడం కుంగిపోయింది! మరో నెల రోజుల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా కుంగదీసేలా.. మేడిగడ్డ లక్ష్మీబరాజ్ కుంగింది. కాళేశ్వరంపై నిత్యం విమర్శలు చేస్తున్న కాంగ్రెస్.. ఇదే అదనుగా.. ప్రభుత్వంపై విరుచుకుపడింది. సాంకేతిక లోపాలు, తగిన డిజైన్, నిర్దిష్ట తనిఖీలు లేకపోవడం వల్ల జరిగిన మానవ తప్పిదమేనని నిపుణులు అంటున్నారు. పేలుడు వాదనను ఖండిస్తున్న నిపుణులు.. బాంబు పెడితే ఎగిరిపోతుంది కానీ.. కుంగిపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు ఈఈ తిరుపతిరావు మాత్రం.. నష్టం ఏమీ లేదని, ఆందోళన చెందే అవసరమూ లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు హాట్ టాపిక్‌గా నిలువబోతున్నదనేది మాత్రం ఖాయం.
విధాత బ్యూరో, కరీంనగర్: తన మానస పుత్రికగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకొనే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ ఆకస్మికంగా కుంగడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత మేడిగడ్డ బరాజ్ వంతెన 20వ పిల్లర్ కుంగిన విషయాన్ని దానిపై నుంచి వెళుతున్న కొందరు గమనించి, సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగు చూసింది. శనివారం ఉదయం నుంచే బరాజ్ కుంగుతూ ఉన్నట్టు కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే.. నిత్యం బరాజ్ రక్షణ నిమిత్తం ఉండే సిబ్బంది, తనిఖీలు చేసే అధికారులు ఈ సమయంలో ఏమైపోయారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు మాత్రం విద్రోహ చర్య కారణమై ఉంటుందనే సందేహాన్ని ముందుకు తీసుకురావడం గమనార్హం.
మహారాష్ట్రవైపు నుంచి పేలుడు శబ్దం వినిపించిందని చెబుతూ బాంబు పేల్చడం వల్లే 20 పిల్లర్ కుంగిందనే వాదనను స్థిరీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 20 నంబర్ పిల్లర్ కుంగిపోవడంతో దాని ప్రభావం 21 నుంచి 25వ పిల్లర్ దాకా ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనితో అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు బరాజ్ నుంచి నీటిని ఖాళీ చేయడం ప్రారంభించారు. 85 క్రస్ట్ గేట్లలో, 45 గేట్లను ఎత్తివేసి, బ్యాక్ వాటర్‌ను దిగువకు విడుదల చేశారు. స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేవలం అధికారులు తప్ప అక్కడికి మరెవ్వరికీ ప్రవేశం లేకుండా చేశాయి.
ఇప్పుడు పిల్లర్ కుంగిపోయిన నేపథ్యంలో అక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మీడియా ప్రతినిధులను కూడా వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇటీవలి వరదల కారణంగా కన్నెపల్లి పంపు హౌస్‌లోకి నీరు చేరి, తీవ్ర నష్టం వాటిల్లింది. పంప్‌హౌస్ మొత్తం నీట మునిగిపోవడంతో అందులో విదేశాల నుంచి తెప్పించిన బాహుబలి మోటర్లలోకి నీరు చేరింది. వాటిని పునరుద్ధరించే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని తెలుస్తున్నది.
దీనిపైనా తీవ్ర విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొన్నది. ఈలోపే ఉరుము లేకుండా పిడుగు పడినట్టు.. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన మేడిగడ్డ బారాజ్ కుంగిపోయింది. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార బీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య యుద్ధమే నడుస్తున్నది. ఇటువంటి సమయంలో, అందులోనూ ఎన్నికలు రాబోతున్న వేళ జరిగిన పరిణామం ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర అంశమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నిత్యం నిశిత పరిశీలన
ఈ బరాజ్‌పై అంతరాష్ట్ర చెక్ పోస్ట్, మరో పోలీస్ అవుట్ పోస్ట్ ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రవాణాకు సంబంధించి ఈ రెండు వ్యవస్థలు నిత్యం నిశిత పరిశీలన జరుపుతుంటాయి. అలాంటప్పుడు 20వ నంబర్ పిల్లర్ కుంగిపోవడం వెనక విద్రోహ చర్య ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం నష్ట నివారణ చర్యకు ఒక సాకుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
నష్టం లేదు.. ఆందోళన వద్దు
బరాజ్ కుంగిపోవడానికి ముందు పేలుడు వంటి శబ్దం వచ్చిందని ప్రాజెక్ట్ ఈఈ తిరుపతిరావు వెల్లడించారు. దీంతో తమ కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమయ్యారని చెప్పారు. మహారాష్ట్ర వైపు నుండి 3 మీటర్ల దూరంలో 20వ పిల్లర్ వద్ద శబ్దం వచ్చినట్టు చెప్పారు. అక్కడికి వెళ్లి పరిశీలిస్తే బ్రిడ్జి కొంత సింక్ అయినట్టు కనిపించిందన్నారు. దీనివల్ల పెద్దగా నష్టం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్టు చెప్పారు. గోదావరిలో వందేళ్ళ నీటి ప్రవాహ ఉధృతిని పరిగణలోకి తీసుకొని బరాజ్ డిజైన్ చేసినట్టు తెలిపారు.
1986 ఆగస్టు 15న అత్యధికంగా వరద నీరు రాగా, గత ఏడాది దానికన్నా ఎక్కువగా 1.02 మీటర్ల నీరు వచ్చినప్పటికీ, ఎలాంటి ప్రమాదానికి తావు లేకుండా దిగువకు వెళ్ళిపోయాయని చెప్పారు. ఇప్పటికీ మేడిగడ్డ బరాజ్ పనులు ఎల్ అండ్ టి ఆధీనంలో ఉన్నాయని, మరో ఐదేళ్లు నిర్వహణ బాధ్యత వారిదే అని చెప్పారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్ ప్రకటనలో భాగంగానే బరాజ్ నిర్మాణ, నిర్వహణ కాంట్రాక్టు యాజమాన్యం.. బరాజ్ కుంగిపోవడం వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తూ.. మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది.

బరాజ్ వద్ద నేతల ఆందోళన
కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో వివిధ రాజకీయ పక్షాల నేతలు అక్కడికి వెళ్లి, పరిస్థితి గమనించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అనుమతించకపోవడంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు. ఒకనాడు ప్రాజెక్టు నిర్మాణ పనులను చూపేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజానీకాన్ని ప్రభుత్వ ఖర్చులతో పంపించిన బీఆరెస్ సర్కార్.. ప్రస్తుతం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తమను అడ్డుకుంటున్నదని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఏనాటికైనా న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై బీజేపీ నేతలు మాటలకే పరిమితం అయ్యారని ఆరోపించారు. దీనిపై కేంద్రం ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు నెలల వ్యవధిలో కాళేశ్వరం అవినీతిపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. విచారణ అనంతరం కేసీఆర్ కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమన్నారు.
ప్రజల సొమ్ము నీళ్లపాలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో ప్రభుత్వం ప్రజల సొమ్మును నీళ్ల పాలు చేసిందని స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. కేవలం ప్రతిష్ఠకుపోయి తక్కువ సమయంలో నిర్మాణ పనులు చేపట్టడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఈ ప్రాజెక్టు వ్యవసాయ రంగానికి ఉపయోగపడింది లేదని చెప్పారు. బరాజ్ కుంగిపోవడం పై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. ఇలాంటి ప్రాజెక్టును చూడడానికి తమ జాతీయ నేత రాహుల్ గాంధీ రావాలా? అంటూ ఎద్దేవా చేశారు.
డిజైన్ లోపంవల్లే కుంగింది: రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ
విధాత: మేడిగడ్డ బరాజ్ మానవ తప్పిదమేనని రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ అన్నారు. మేడిగడ్డ కుంగడంపై ఆయన ఒక చానల్‌లో మాట్లాడుతూ మేడిగడ్డ బరాజ్ శనివారం ఉదయం నుంచే కుంగడం ప్రారంభించిందన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టుల నిర్మాణంలో 90 శాతం రాక్ ఫౌండేషన్‌తో నిర్మిస్తారన్నారు. శాండ్ ఫౌండేషన్‌తో నిర్మించాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాండ్ ఫౌండేషన్‌తో నిర్మించే ప్రాజెక్టులకు జియాలజిస్టుల పర్మిషన్ తీసుకొని, వారి సూచనల మేరకు నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు.
డిజైనింగ్ లోపం వల్లే
లక్ష్మీ బరాజ్ నిర్మాణంలో డిజైనింగ్ లోపం ఉన్నదని లక్ష్మీనారాయణ తెలిపారు. 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా డిజైన్ చేశామని చెబుతున్నారని, మరి గత ఏడాది వచ్చిన వరదకు మోటర్లు ముగినిపోయాయని చెప్పారు. లక్ష్మీ బరాజ్‌ను రివర్ బెడ్ మీదనే నిర్మించారని, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, హడావిడిగా నిర్మించారని అన్నారు. ఎవరో బాంబులు వేశారని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై మాట్లాడుతూ బాంబులు పెడితే ఎగిరి పోతది కానీ కుంగిపోదన్నారు. తప్పించుకోవడానికే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినట్లుందని అభిప్రాయపడ్డారు. బరాజ్‌లో కింది నుంచి ఎప్పుడో లీకేజీ మొదలైందన్నారు. ఫౌండేషన్ కింద పూర్తి గ్యాప్ వచ్చినప్పుడు కిందకు కుంగి ఉంటుందన్నారు. గేట్లు ఫిక్స్ అయినప్పుడు కుంగిపోతే భారీ శబ్దం వస్తుందని ఆయన తెలిపారు. దీనిని సరిచేయడం చాలా కష్టమన్నారు. మొత్తం రీప్లేస్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. గ్యారెంటీ ఉంటుందని అంటున్నారు కానీ పగిలిన దానికి ఎవరు గ్యారెంటీ ఇస్తారని ప్రశ్నించారు.
ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల
కాళేశ్వరం ఎత్తి పోతల పథకం కాదని, తిప్పిపోతల పథకమని లక్ష్మీనారాయణ అన్నారు. నాలుగేళ్లలో 150 టీఎంసీల నీటిని ఎత్తి పోసి, 50 టీఎంసీల నీటిని కిందకు వదిలారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిరర్థకమైనదిగా అభివర్ణించిన ఆయన వీళ్లకు వాస్తవాలు చెప్పే దమ్ములేదన్నారు. ఇది పనికి రాకుండా పోతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ సాంకేతిక లోపం, డిజైన్ లోపం, ప్రాపర్ ఇన్వెస్ట్‌గేట్ చేయకపోవడం వంటిపొరపాట్లకు కుంగుబాటు ఫలితమని చెప్పారు.
డీపీఆర్ లోపమేనా?
నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ – డీపీఆర్ అత్యంత కీలకం. శరవేగంతో ప్రాజెక్టు నిర్మించాలన్న ప్రభుత్వ ఉద్దేశంతో డీపీఆర్ సంగతి విస్మరించిందని ఆరోపణలు వస్తున్నాయి. అదే మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు కారణమని చెబుతున్నారు. నిర్మాణ సంస్థలు క్వాలిటీ, కంట్రోల్ మాత్రమే పర్యవేక్షిస్తాయని, అసలు లోపం అంతా ప్రణాళికలోనే ఉందని నీటిపారుదల రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వరద ప్రవాహం ఎక్కువగా లేకపోవడం వల్ల ప్రమాద స్థాయి తక్కువగా ఉందని, లేనిపక్షంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని పేర్కొంటున్నారు. నదిలో నీటి ప్రవాహం వల్ల భూమి పొరలు సింక్ అవుతాయని, ప్రణాళిక లోపం వల్లనే ఈ పరిణామం సంభవించిందని వారంటున్నారు.