MLC Kavitha | బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విచారణ 20కి వాయిదా
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

సీబీఐ, ఈడీలకు సుప్రీం కోర్టు నోటీసులు
విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ, సీబీఐలను అఫిడవిట్‌లు దాఖలు చేయాలని నోటీస్‌లు జారీ చేసింది. కాగా కవిత తరపు న్యాయవాదులు కనీసం మధ్యంతర బెయిల్ అయినా మంజూరీ చేయాలని కోర్టును కోరగా, ఈడీ, సీబీఐల అఫిడవిట్‌లను పరిశీలించాక ఈ కేసును ఈ నెల 20న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కవిత బీఆరెస్ ఎమ్మెల్సీగా, రాజకీయ నాయకురాలిగా ఉన్నారని, మహిళయైన ఆమె ఇప్పటికే ఐదు నెలలుగా జైలులో ఉంటున్నారని, ఆమెకు బెయిల్ మంజూరీ చేయాలని కవిత న్యాయవాదులు వాదించారు. ఇప్పటికే ఈ కేసులో 500మంది వరకు సాక్షులను విచారించారని, కేసు ఎప్పటికి తేలుతుందో స్పష్టత లేనందునా బెయిల్ ఇవ్వాలని కోరారు.
అయితే ఈడీ, సీబీఐ న్యాయవాదులు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలకమైన వ్యక్తి అని, కేసు పూర్వపరాలను వివరించారు. ఇప్పటి వరకు 460మంది సాక్షులను మాత్రమే విచారించామని, కేసు విచారణ కొనసాగుతుందని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈడీ, సీబీఐలకు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా, జైలులోనే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి కవిత తీహార్ జైలులోనే ఉంటున్నారు. అయితే ఇటీవల ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఈడీ కేసులో బెయిల్ ఇవ్వగా, సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ విచారణ కొనసాగుతుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు 17నెలల అనంతరం తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ఈ నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆరెస్ నేతలు గట్టి ఆశలే పెట్టుకున్నారు.