సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామంలో ఒక్కసారిగా రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఎర్కారం మాజీ సర్పంచ్ మౌనిక భర్త, బీఆర్ఎస్ నాయకులు చింతలపాటి మధు దారుణ దుండగుల చేతిలో దారఉన హత్య గురైన ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. శుక్రవారం (మే 22) సూర్యాపేటలోని తన నివాసం నుండి బయటకు వెళ్లిన మధు, సాయంత్రం నుండి ఫోన్లో అందుబాటులో లేకుండా పోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత యల్కారం గ్రామ శివారులోని ఓ పిల్ల కాలువలో అనుమానాస్పదంగా మూట కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మధు మృతదేహంగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సంచలన విషయాలను గుర్తించారు.
సూర్యాపేటలోని తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన తాటిపాముల జానయ్య అనే వ్యక్తి ఇంట్లోనే ఈ దారుణ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ ఇంట్లో మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అక్కడే మధును హతమార్చి, అనంతరం మృతదేహాన్ని వాహనంలో యల్కారం శివారుకు తరలించినట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో హత్య జరిగింది.
ప్రతికారంలోనే హత్య
మృతుడు చింతలపాటి మధు 25 ఏళ్ల క్రితం జరిగిన గ్రామ మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ పాత కక్షల నేపథ్యంలోనే మిద్దె రవీందర్ వర్గీయులు పక్కా స్కెచ్‌తో మధును హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యల్కారం ఫ్యాక్షన్ పరంగా అత్యంత సున్నితమైన గ్రామం కావడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పికెట్ నిర్వహించారు. మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగా ఆయన కుమారుడు మిద్దె జీవన్ ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2018లో బీఆర్ఎస్ నాయకుడిని ఓటెద్దు వెంకన్నను దారుణంగా హతమార్చిన కేసులో చింతలపాటి మధు సాక్షిగా ఉన్నారు. కేసు విచారణ తుది దశకు చేరుకోగా, మధు సాక్ష్యం చెప్తే తమకు యావజ్జీవ శిక్ష తప్పదని భావించి దుండగులు మిద్దె జీవన్, మిద్దె కిరణ్, మారేపల్లి సతీష్, కుంటిగోర్ల శ్రీను, కట్టబోయిన మల్లయ్య లు మధును హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రంగా యల్కారం
యల్కారం గ్రామంలో 1985 నుండి రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇరువర్గాల మధ్య కక్షల కారణంగా సుమారు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 1985 ప్రాంతంలో గ్రామ టీడీపీ నాయకుడు యలగందుల సిద్దయ్య సూర్యాపేటలో దారుణ హత్యకు గురైయ్యారు. అప్పటి నుండి తాజాగా జరిగిన మధు హత్య వరకు సుమారుగా ఎనిమిది మంది రాజకీయ కక్షలు బలైయిపోయారు. 1985 లో యలగందుల సిద్దయ్య హత్య తర్వాతా కాంగ్రెస్ నేత పల్లె ఈదయ్య, అనంతరం 1996 సిద్దయ్య కుమారుడు అజయ్ హత్యకు గురయ్యాడు. అప్పటి నుండి గ్రామంలో హత్యారాజకీయాలు కొనసాగుతున్నాయి. అజయ్ హత్య జరిగిన కొద్దీ రోజులకే అప్పటి గ్రామ సర్పంచ్ మిద్దె రవీందర్ పై హత్యా యత్నం జరిగింది. ఆ ఘటనకు చింతలపాటి చిన్న రమేషే కారణమని భావించి 1999లో రమేష్ ని హత్య చేశారు.
రమేష్ హత్య అనంతరం కొంత కాలం ప్రశాంతంగా ఉన్న గ్రామం తిరిగి 2007 లో మిద్దె రవీందర్ హత్యతో భగ్గుమంది. రవీందర్ హత్యతో పోలీసులు జాగ్రత్త పడి గ్రామంలోని అన్ని వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి సమన్వయం చేశారు . కొద్దీ రోజులపాటు పోలీసుల చర్యలు ఫలితాల ఇచ్చి గ్రామం ప్రశాంతంగా మారింది. ఇంతలోనే 2020 లో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నని గ్రామంలో దారుణంగా హత్య చేశాడు ప్రత్యర్థి వడ్డే ఎల్లయ్య. అయితే 2024 ఎల్లయ్యని జగ్గయ్యపేట సమీపంలో అతని ప్రత్యర్థి శ్రీకాంతా చారి హత్య చేశాడు. చింతలపాటి మధు 25 ఏళ్ళ క్రితం జరిగిన గ్రామ మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇదే పరంపరలో మిద్దె రవిందర్ వర్గీయులు చింతలపాటి మధును హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వరుస హత్యలతో యల్కారం పేరు చెబితేనే చుట్టుపక్కల ప్రజలు హడలిపోతున్నారు. రాజకీయ కక్షల వల్ల నలిగిపోతున్న పలు కుటుంబాలు గ్రామాన్ని వదిలి వలస వెళ్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
Sekhar Kammula | చిరంజీవి నా అభిమాన హీరో.. ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం, ఆమెని మిస్ అవుతున్నా..
పక్కా స్కెచ్ తో.. కారుతో ఢీ కొట్టి న్యాయవాదిపై హత్యా యత్నం
