ప్రభుత్వాన్ని ప్రశ్నించే సినిమాలతో రిస్క్‌.. అయినా తీస్తాం: భారతీయుడు 2 ట్రైలర్‌ విడుదలలో కమల్‌హాసన్‌

ప్రభుత్వాన్ని ప్రశ్నించే సినిమాలతో రిస్క్‌ ఉంటుందని ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. కళాకారులు కూడా దేశ పౌరులేనని, వారికి అన్ని అంశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని వ్యాఖ్యానించారు

ప్రభుత్వాన్ని ప్రశ్నించే సినిమాలతో రిస్క్‌.. అయినా తీస్తాం: భారతీయుడు 2 ట్రైలర్‌ విడుదలలో కమల్‌హాసన్‌

చెన్నై: ప్రభుత్వాన్ని ప్రశ్నించే సినిమాలతో రిస్క్‌ ఉంటుందని ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. కళాకారులు కూడా దేశ పౌరులేనని, వారికి అన్ని అంశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను నటించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2: జీరో టాలరెన్స్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో బుధవారం కమల్‌ మాట్లాడారు. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తున్నది. స్వాతంత్ర్య సమరయోధుడైన సేనాపతి.. అవినీతిపై పోరాడే కథాంశంతో భారతీయుడు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సినిమా కూడా అదే కథాంశంతో వస్తున్నది. ఈ సినిమాకు కూడా శంకర్‌ దర్శకత్వం వహించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సినిమాలు చేయడం కష్టమా? అన్న ప్రశ్నకు కమల్‌ స్పందిస్తూ.. ఆ సమస్య బ్రిటిష్‌ కాలం నుంచి ఉన్నదేనని చెప్పారు. ‘అయినప్పటికీ అటువంటి సినిమాలు చేస్తూనే ఉన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా సరే.. అటువంటి సినిమాలను తీయడం మేం కొనసాగిస్తాం. ప్రశ్నించడం అనేది సినిమా తీసేవారిదే కాదు.. అది అందరు ప్రజల హక్కు’ అని అన్నారు.

‘కళాకారులుగా మేం మీలో అనేక మందికి ప్రాతినిధ్యం వహిస్తాం. మీ అభినందనలకు ధన్యవాదాలు. మేము మీ ప్రతినిధులమని భావిస్తాం. అందుకే మా తల తీస్తామన్నా.. మేం నిర్భయంగా మాట్లాడుతాం. అవును.. రిస్క్‌ ఉన్నది. ప్రభుత్వానికి కోపం రావచ్చు.. కానీ.. మీ చప్పట్టు ఆ మంటలను ఆర్పివేస్తాయి. అందుకే.. వాటి శబ్దాన్ని పెంచండి’ అని కమల్‌ విలేకరులతో అన్నారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతికి రాజకీయ నాయకులే కాదు.. ప్రజలు కూడా కారణమేనని చెప్పారు. ‘అవినీతికి మనం అందరం బాధ్యులమే. మన ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. మన ఆలోచనాధోరణి మార్చుకోవడానికి మంచి అవకాశం ఎన్నికలే. మనం ఎంత అవినీతిపరులుగా మారిపోయామో ఇవి గుర్తు చేస్తుంటాయి. అవినీతి పుణ్యమాని ఏమీ మారలేదు. సమిష్టిగా వ్యవహరిస్తే ప్రతిదీ మారుతుంది’ అని కమల్‌ పేర్కొన్నారు.

తాను మహాత్మా గాంధీ అభిమానిని అయినప్పటికీ.. ఆయన సహన సిద్ధాంతాన్ని ఆమోదించనని చెప్పారు. గాంధీజీ హత్యకు వ్యతిరేకంగా తీసిన హేరాం చిత్రంలో సైతం కమల్‌హాసన్‌ నటించారు. ‘నేను గాంధీజీకి గొప్ప అభిమానిని. ఆయన సహనం నేర్పించారని చెబుతారు. అసలు సహనం అంటే ఏమిటి? సహనం అనేది నాకు తగదు. గాంధీజీ నాకు హీరోనే కానీ.. ఎందుకు సహించాలి? అదేమీ మన మిత్రుడు కాదే’ అని కమల్‌ అన్నారు. ఈ ప్రపంచంలో స్నేహం వెల్లివిరియాలని తాను కోరుకుంటానని తెలిపారు. సహించడం అంటే తలనొప్పే. సమాజానికి తలనొప్పిగా ఏది ఉన్నా.. దాన్ని అస్సలు సహించకూడదు. దానికి ఒక ఔషధాన్ని కనిపెట్టి.. దానిని తీసేయాలి’ అని చెప్పారు. కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తదితరులు భారతీయుడు 2 సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 12న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.