బీఆర్ఎస్, బీజేపీ ఓటమే సీపీఐ లక్ష్యం తక్కళ్లపల్లి శ్రీనివాస రావు

బీఆర్ఎస్, బీజేపీ ఓటమే సీపీఐ లక్ష్యం తక్కళ్లపల్లి శ్రీనివాస రావు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఓటమే లక్ష్యంగా పని చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ శివనగర్ పార్టీ జిల్లా కార్యాలయం తమ్మెర భవన్ లో జిల్లా సమితి సమావేశం జరిగింది. పరికిరాల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.


ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, నియంతృత్వ పాలన సాగించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఎన్నికల ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని, ఈ ప్రజావ్యతిరేక పార్టీలను ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందన్నారు. బీఆర్ఎస్ గత ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, ఎన్నికల ముందర హడావుడిగా పథకాలు ప్రవేశ పెట్టి, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించిందని విమర్శించారు.


ఎన్నికల ముందర అమలు చేయలేని హామీలతో ముందుకు వస్తున్న బీఆర్ఎస్, బీజేపీల వైఖరిని ప్రజలు ఎడగట్టాలన్నారు. ఆ రెండు పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ బాష్ మియా, పనాస ప్రసాద్, నాయకులు అక్కపెల్లి రమేష్, బుస్సా రవీందర్, గన్నారపు రమేష్, గుంపెల్లి మునీశ్వరుడు, తోట చంద్రకళ, గుండె బద్రి, కే చెన్నకేశవులు, దామెర క్రిష్ణ, టీ రహేలా పాల్గొన్నారు.