టీడీపీ అసలు స్వరూపం మరోసారి బట్టబయలైంది. తెలంగాణలోని టీడీపీ నాయకులు సైతం తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని మరోసారి రుజువైంది. తెలంగాణపై విషం కక్కిన ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులు.. అసలు తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని తేల్చిపారేశారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో మాట్లాడిన బక్కని.. ‘ఈ తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి. తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొందరు స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి, అనేకమంది కష్టపడేవాళ్ల జీవితాల్లో మన్నుబోసిన్రు తెలంగాణలో’ అని ఆయన అన్నారు. తద్వారా తెలంగాణ ఏర్పాటునే ఆయన ప్రశ్నించారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
వాస్తవానికి ఉద్యమ కాలం నుంచే తెలంగాణకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు వ్యవహరించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు గతంలో అసెంబ్లీలో తెలంగాణ పదాన్నే నిషేధించారు. అనేక సంవత్సరాలు గడిచిపోయి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కూడా టీడీపీ నాయకులు.. తెలంగాణపై విషం కక్కడం మానలేదని బక్కని నర్సింహులు తాజా వ్యాఖ్యలతో తేలిపోతున్నది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన నర్సింహులు రాష్ట్ర పార్టీ అధ్యక్ష హోదాలో ఉండి కూడా చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణపై విషం కక్కారన్న విమర్శలు వెల్లువెత్తాయి. బీఆరెస్, కాంగ్రెస్ నాయకులు బక్కనిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో పుట్టి, ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం తెలంగాణ గురించి మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. ఆంధ్రా పార్టీ టీడీపీకి తెలంగాణలో రాష్ట్ర శాఖ ఆఫీసు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధిస్తామని అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు యాదవ్ అంటే మాజీ సీఎం కేసీఆర్ పట్టుబట్టి చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించారని గుర్తు చేశారు. బక్కని నర్సింహులు వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బాబు మెప్పుకోసమే..: నిరంజన్‌రెడ్డి
తెలంగాణ మట్టిలో పెరిగి ఏపీ సీఎం చంద్రబాబు మెప్పుకోసం బక్కని నర్సింహులు ‘డిక్షనరీలో తెలంగాణ అనే పదం లేదు ‘ అని వ్యాఖ్యానించడం దుర్మార్గం, దురదృష్టకరం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇది ఆయన అజ్ఞానం మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమేనని చెప్పారు. తెలంగాణ అనే పదం చరిత్రలో ఎన్నో శాసనాల్లో, సాహిత్యంలో, రాజ్యాల చరిత్రలో ఉందని గుర్తు చేశారు. క్రీ.శ.1417 తెల్లాపూర్ శాసనం నుండి కాకతీయుల కాలువకు కొనసాగిన త్రిలింగ దేశం అనే పదం నుండి తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అన్న పదం ఏ డిక్షనరీలో చూసి చెప్పాడో బక్కని నర్సింహులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం, అమరుల ఆత్మ బలిదానాల ఫలితంగా 2014లో పార్లమెంటులో చేసిన చట్టం ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. చంద్రబాబు మెప్పుకోసం బక్కని నర్సింహులు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను అవమానించడమేనన్నారు. మీలాంటి వాళ్లు చరిత్రలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. ‘తెలంగాణ మీ డిక్షనరీలో లేకపోవచ్చు కానీ అది మా ఆత్మగౌరవం. మా రక్తంలో, మా గుండెల్లో, మా భూమిలో, మా భాషలో, మా యాసలో, మా సంస్కృతిలో దాగి ఉంది. మీలాంటి ద్రోహుల మాటలు మా ప్రజలను మరింత బలోపేతం చేస్తాయి. తెలంగాణ తేజాన్ని , వైభవాన్ని విశ్వవీధుల్లో ఎగరేస్తాయి’ అని అన్నారు.
Read Also |
బాల్క సుమన్ ‘విధ్వంస’ వ్యాఖ్యలు యాదృచ్ఛికమా.. వ్యూహాత్మకమా?
పట్టపగలే చిమ్మ చీకటి.. ఆగస్ట్ 2న ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్య గ్రహణం.. భారత్‌లో?
రాజ్యసభకు సిద్దరామయ్య…సీఎంగా డీకే శివకుమార్!