BC Reservation | బీసీ రిజర్వేషన్ల పిటిషన్ పై హైకోర్టు బెంచ్ ఏర్పాటు..ఈ రోజు సాయంత్రం విచారణ
బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఈ రోజు సాయంత్రం 5గంటలకు అత్యవసరంగా విచారణ చేపట్టనుంది.

విధాత, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన హౌజ్ మోషన్ పిటిషన్ విచారణకు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటు చేశారు. జస్టిస్ విజయ్ సేన్, జస్టిస్ అభినందన్ కుమార్ షావలిలతో కూడిన బెంచ్ ను ప్రకటించారు. ఈ బెంచ్ ఈ రోజు శనివారం సాయంత్రం 5గంటలకు బీసీ రిజర్వేషన్ల పిటిషన్ ను విచారించబోతుంది. హైకోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారిస్తున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతల మండలం కేశవాపూర్ కు చెందిన రెడ్డి జాగృతి అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త బుట్టెంగారి మాధవరెడ్డి ప్రభుత్వం జారీ చేసిన బీసీ రిజర్వేషన్ల పిటిషన్ దాఖలు చేస్తూ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి 50శాతం దాటకుండా ఆదేశించాలంటూ తన పిటిషన్ లో కోరారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో రిజర్వేషన్లు 50శాతం మించకుండా పరిమితి విధించారని..దాన్ని కొనసాగించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అందులో ఉన్న విధంగా బీసీలకు 26శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 9శాతం మొత్తం 50శాతం వరకే రిజర్వేషన్లు పరిమితం చేయాలని కోరారు.