వంద రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు దిశగా చర్యలు.. : తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం
తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్లను వంద రోజుల్లో చెల్లించే దిశగా ప్రయత్నం చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులు చర్చలకు రావాలని ఆహ్వాానించింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో వివరించారు.
- గచ్చిబౌలిలో డెవలపర్స్‌కు భూమి.. దానిపై ఆదాయం క్రీడలకే కేటాయింపు
- తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలు
- చర్చలకు రావాలని ఆర్టీసీ కార్మికులకు పిలుపు
తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో పదేండ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని సమావేశం అనంతరం విడుదలైన ప్రకటన పేర్కొంది. తెలంగాణ ఏర్పడే నాటికి ఒక్క రూపాయి కూడా బకాయి లేదని తెలిపింది. రిటైర్మెంట్ ఏజ్ పెంచటంతో పాటు రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవటంతో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్న విషయాన్ని మంత్రివర్గం పరిగణనలోకి తీసుకుంది. ఈ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా వెంటనే వారికి ఇచ్చే బకాయిల చెల్లింపులకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ.6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీటిని వెంటనే ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పటికీ వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అన్వేషించి, అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అవసరమైతే తమ జీతాలు, ప్రజా ప్రతినిధులకు ఇచ్చే జీతాల నుంచి 50 శాతం రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే సర్దుబాటు చేసేందుకు మంత్రులందరూ ఉదారంగా ముందుకువచ్చారు. రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు, బాధ్యులైన వారందరినీ పిలిచి చర్చలు జరపాలని, వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వంద రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు దిశగా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
ఆర్టీసీ కార్మికులు… చర్చలకు రండి..
రెండు రోజులుగా కొనసాగిస్తున్న సమ్మెను విరమించాలని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. కార్మికులు సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపింది. సమస్యలను పరిష్కరించాలనే సానుకూల వైఖరితోనే ప్రభుత్వం అధికారుల కమిటీ వేసిందని పేర్కొంది. శుక్రవాం ఉప ముఖ్యమంత్రి అధ్వర్యంలో చర్చలకు రావాలని కార్మిక సంఘాలకు కేబినెట్ విజ్ఞప్తి చేసింది.
హైకోర్టు తీర్పుతో సీబీఐ దర్యాప్తునకు అడ్డంకి లేదు
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర క్యాబినెట్ చర్చించింది. జ్యుడిషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టలేదని, కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు తప్పుబట్టలేదని పేర్కొంది. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని కూడా అభిప్రాయపడింది. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే కేవలం సాంకేతిక కారణాలను హైకోర్టు తప్పుబట్టిందని, ఈ నివేదికలో వారిపై ప్రస్తావించిన అంశాలు అమల్లో ఉండవని, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే తీర్పునిచ్చిందని ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, లోపాలు, అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయాన్ని ఆ ప్రకటన ప్రస్తావించింది. తొమ్మిది నెలలైనా సీబీఐ దర్యాప్తు ఇంకా ప్రారంభం కాలేదని పేర్కొంది. హైకోర్టు తీర్పు సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకిగా లేదని న్యాయ నిపుణులు తెలిపిన నేపథ్యంలో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రభుత్వం తరఫున మరోసారి సీబీఐని కోరాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు మొత్తం పరిశీలించిన తర్వాత ఢిల్లీలో ఉన్న న్యాయ నిపుణులతో సంప్రదించి, సుప్రీంకోర్టుకు వెళ్లాలా.. లేదా.. అనేది, వారిచ్చే సలహాలు ఆధారంగా నడుచుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో పదవీ కాలం పూర్తయిన పీఏసీఎస్‌లకు నామినేట్ పద్ధతిన పాలకవర్గాలను నియమించేందుకు క్యాబినెట్ ఆమోదించింది.
గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుబాటులో ఉన్న 76 ఎకరాలకు గాను.. 64 ఎకరాల్లో 21 రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడం, అవుట్‌డోర్ స్టేడియం సామర్థ్యం 20 వేల నుంచి 50 వేలకు పెంచడంపై నిర్ణయాలు తీసుకున్నది. స్విమ్మింగ్ పూల్ సామర్థ్యం పెంపుతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు… క్రీడాకారులకు వసతి, శిక్షణ సౌకర్యాలు కల్పించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మిగిలిన 12 ఎకరాలను డెవలపర్స్‌కు ఇచ్చి, కమర్షియల్ యాక్టివిటీస్‌కు అనుమతి మంజూరు చేసింది. కమర్షియల్ యాక్టివిటీస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్వహణ, క్రీడాకారుల వసతి, శిక్షణ తదితర కార్యక్రమాలకు ఉపయోగించాలని కేబినెట్ నిర్ణయించింది.
- మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
- మహాదేవ్‌పూర్, కాటారం, మల్హర్ రావు, మహముత్తారం మండలాల్లో దాదాపు 45 వేల ఎకరాలకు, 63 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం చేకూరుతుంది.
- భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది.
- ఈ ప్రాజెక్టుకు దాదాపు 2427 ఎకరాల భూమి అవసరం.
- ఇప్పటివరకు 1020 ఎకరాలు సేకరించారు.
- మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 85.10 ఎకరాలను మత్స్య శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram