తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణ‌యాలు ఇవే !

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు.

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు.

రెండో విడతలో 2.50లక్షల ఇందిరమ్మ ఇండ్లు

రాష్ట్రంలో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 లక్ష‌ల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు.

అసంపూర్తి ఇళ్లకు నిధులు

ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడ‌లు, శ్లాబు ద‌శ‌లో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పునాదులు పూర్త‌యి గోడ‌లు, శ్లాబు ప‌డ‌ని ఇళ్ల‌కు రూ.3 ల‌క్ష‌లు, గోడ‌లు పూర్త‌యి శ్లాబు నిలిచిపోయిన ఇళ్ల‌కు రూ.2 ల‌క్ష‌లు చొప్పున అందిస్తాం. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల‌కు చొప్పున నిధులు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. రాష్ట్రంలో 15 వేల కుటుంబాలు పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నట్టు వివిధ సర్వేల్లో వెల్లడైన నేపథ్యంలో ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందించాలని మంత్రిమండలి తీర్మానించింది.

తొలి విడ‌త‌లో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల‌లో జూన్ రెండు నాటికి దాదాపు ల‌క్ష ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయని, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెర‌మెరి మండ‌లం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల‌కు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిర‌మ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించాం. జూన్ 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క, రాష్ట్ర మంత్రులందరం అక్కడికి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం అని పొంగులేటి తెలిపారు.

క్యూర్ పరిధిలో పేదలకు లక్ష ఇళ్లు

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం క్యూర్ ప‌రిధిలోని 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో అల్పాదాయ వ‌ర్గాల వారి కోసం (LIG) ల‌క్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని రాష్ట్ర కేబినెట్ నిర్ణ‌యించింది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ద‌ఫాలుగా చేసిన స‌ర్వేల ప్ర‌కారం 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించింది. వెంట‌నే ఆ కుటుంబాల‌న్నింటికి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు ప‌త్రాలు అందించాల‌ని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. గుడిసెలు లేని ఆద‌ర్శ రాష్ట్రంగా తెలంగాణ‌ను నిల‌పాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది.

గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్లు

వ‌చ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్న గోదావ‌రి పుష్క‌రాల‌కు సంబంధించి వివిధ పనులు చేప‌ట్టేందుకు రూ.1000 కోట్ల నిధులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తొలి విడ‌త‌గా రూ.300 కోట్లు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఆర్డీఎస్ఎస్ స్కీమ్ లో తెలంగాణ

విద్యుత్ పంపిణీ, మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ RDSSలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌కు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగు పరిచి నష్టాలు తగ్గించడానికిరూ.25వేల కోట్లతో ఆర్డీఎస్ఎస్ అమలుకు ఇంధన శాఖ ఇచ్చిన ప్రతిపాదనలను ఆమోదించినట్లుగా తెలిపారు.

జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం

రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం పాఠశాలలతో పాటు అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకూ ఉదయం అల్పాహారంతో పాటు పాలు అందించాల‌ని నిర్ణ‌యించింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలోని నూతన డిగ్రీ కళాశాలలో 20 శాశ్వత బోధన, 6 బోధనేతర, 3 పొరుగు సేవలలో కేటగిరీలో పోస్టలు మంజూరు చేసింది. కేసముద్రం అగ్నిమాపక కేంద్రానికి 18పోస్టులు మంజూరు చేశాు. అస్సాం రైఫిల్స్, బీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లాలో వెల్దీలో 4ఎకరాలు, రుక్మాపూర్ లో 5, గన్నేరువరం మండలంలో 5 ఎకరాలు కేటాయించారు.

డీసీఎంలు, టీజీఆర్ఐసీల విలీనంపై కీలక నిర్ణయం

రాష్ట్రంలోని DCMSల‌ను మార్క్ ఫెడ్ లను విలీనం చేయాల‌ని రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది. TGRICని (తెలంగాణ రూర‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్‌) హాకాలో విలినం చేయాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది.

పాలమూరు రంగారెడ్డికి రూ.587కోట్లు

పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం భూ సేక‌ర‌ణ‌, పున‌రావాసం, మౌలిక వ‌స‌తుల స‌దుపాయాల క‌ల్ప‌న‌కు రూ.587.27 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

నెక్స్ట్‌ జనరేషన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2026–30

తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్‌ 5 లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకే నెక్స్ట్‌ జనరేషన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2026–30ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దావోస్లో ఈ పాలసీని లాంఛనంగా ఆవిష్కరించామని పొంగులేటి తెలిపారు. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతో పాటు 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడించారు.

లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, బయోటెక్‌, మెడికల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం. యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్‌ హెల్త్‌, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తాం అని తెలిపారు. ఇప్పటివరకు ఎక్కువగా తయారీ మీద దృష్టి ఉంటే, ఇక నుంచి విలువైన ఇన్నోవేషన్‌ మీద ఎక్కువ ఫోకస్‌ పెడతాం అన్నారు. రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ (R&D) యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ పాలసీలో మార్పు తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లు, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్లు తెలంగాణకు రావడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు.

పంట ఉత్పత్తుల కొనుగోలుకు నిర్ణయం

మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 14.89లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం అనుమతించింది. ఇంకా అదనంగా రూ.8,53,817టన్నుల కొనుగోలుకు రూ. 1,877కోట్ల రుణం, బ్యాంకు గ్యారంటీకి మార్క్ ఫెడ్ కు అనుమతించింది. 2,76,277టన్నుల జొన్నల కొనుగోలుకురూ.1154.76కోట్ల రుణం కోసం,10,175టన్నుల పొద్దుతిరుగుడు కొనుగోలుకు రూ.96.37కోట్ల రుణం కోసం ప్రభుత్వ గ్యారంటీలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా మంత్రి పొంగులేటి వివరించారు.

Latest News