BC Reservation Ordinance | 42 % బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

BC Reservation Ordinance | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ జారీ చేసేందుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లభించనున్నది. తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటేరియట్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాలుగు గంటల పాటు సమావేశం జరిగింది. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృఫ్ణారావు, లక్ష్మణ్ కుమార్ మీడియాకు వివరించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రులు చెప్పారు. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు జరిగిన 18 క్యాబినెట్ సమావేశాల్లో తీసుకున్న 327 అంశాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పై కూడా సమావేశంలో చర్చించినట్టు మంత్రులు తెలిపారు. కేబినెట్లో తీసుకున్న అంశాలు 96 శాతం అమల్లోకి వచ్చాయన్నారు. ప్రతి రెండు వారాలకు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన రెండు విద్యా సంస్థలను వర్శిటీలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన దరిమిలా వర్షాలు, వివిధ నదులకు వచ్చే వరదలను ఎదుర్కొనేందుకు, అవసరమైన సహాయ చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖల యంత్రాంగాలను సిద్ధం చేయడంపైనా మంత్రి మండలి చర్చించినట్టు సమాచారం.
త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు
బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తేవాలని ముందుగా ఒక అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వం అందుకే అసెంబ్లీని ప్రొరోగ్ చేసినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం, బనకచర్ల, కృష్ణాజలాల తరలింపు అంశాలపై ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో సవాళ్లు, ప్రతిసవాళ్లు సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, అందులో వీటిని అజెండాలుగా చేర్చడం ద్వారా రికార్డెడ్ చర్చ ఉంటుందని అధికార పక్షం భావిస్తున్నది. ఆ సమావేశాల్లోనే ప్రతిపక్ష బీఆరెస్ ప్రచారాలను తిప్పికొట్టేందుకు అవకాశం ఉంటుందనేది కాంగ్రెస్ నేతల అంచనా. ఈ క్రమంలోనే త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. ఆలోపే ఆర్డనెన్స్ తీసుకువచ్చి, ఎన్నికలకు వెళ్లేందుకు సన్నాహాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే పేర్కొన్నది.