హైదరాబాద్, విధాత:
ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీతో రుణ పునర్వ్యవస్థీకరించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణ పునర్వ్యవస్థీకరణకు కేంద్రాన్ని కూడా ఒప్పించారు. దీంతో బీఆరెస్ హయాంలో అధిక వడ్డీకి తెచ్చిన రుణాలలో రూ.27,988 కోట్లను రీస్ట్రక్చరింగ్ సాధ్యపడింది. ఈ రుణ వాయిదాల చెల్లింపుల కాలాన్ని 10, 12 సంవత్సరాల నుంచి 29, 30 సంవత్సరాలకు పొడిగించినట్లు శాసన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. రూ. గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ. 25,612 కోట్ల రుణాలను పునర్వ్యవస్థీకరించడం వల్ల 2025–26 నుంచి 2031–32 వరకు చెల్లించాల్సిన రూ. 34 వేల58 కోట్ల నుంచి రూ.11 వేల 915 కోట్లకు తగ్గించినట్ల వివరించారు. దీని ద్వారా రాష్ట్రానికి రూ.22 వేల 142 కోట్ల క్యాష్ అవుట్ ఫ్లో తగ్గి నగదు వెసులుబాటు కలిగినట్లు వివరించారు. అలాగే గతంలో టీయుఎఫ్ ఐడీసీ 10.2 శాతంతో తీసుకున్న రూ.172.02 కోట్లను, తెలంగాణ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 9.7 శాతంతో తీసుకున్న రూ.2,204.06 కోట్ల రుణాన్ని 8.6 శాతం వడ్డీకి రీస్ట్రక్చర్ చేసినట్లు తెలిపారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గతంలో అధిక వడ్డీకి తెచ్చిన రుణాలను రీషెడ్యూల్ చేయడంపై కేంద్రీకరించారు. ఈ మేరకు గత ప్రభుత్వం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, కాళేశ్వరం ఎస్పీవీ రుణాల చెల్లింపులకు ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీకి తీసుకోవడానికి కేంద్రం నుంచి అనుమతి పొందారు. అలాగే రాష్ట్రంలో రూ. 87 వేల కోట్ల వరకు రుణాల పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి అప్పీల్ చేసింది.
వందశాతం రిస్క్ ఉన్న అప్పులు రూ. 86,309 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్ల ద్వారాతీసుకున్న గ్యారెంటీ రుణాలలో వంద శాతం రిస్క్‌తో కూడినవి రూ.86,309 కోట్లు ఉన్నట్లు బడ్జెట్ పత్రాలు తెలిపాయి. ఇవి కాకుండా 5 శాతం రిస్క్‌తో మరో రూ.7,772 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వ హయాం నుంచి వారసత్వంగా వస్తున్న అప్పులే కావడం గమనార్హం. మొత్తం రూ.2,41,743 కోట్ల రూపాయల బడ్జెటేతర అప్పులు ఉండగా అందులో రూ.94,081 కోట్లు రిస్క్ తో కూడుకున్నవని తెలిపింది. ఇవన్నీ అధిక వడ్డీకి తీసుకున్నవేనని ఆర్థిక పరిశీలకులు అంటున్నారు.
మూడేళ్లలో కాంగ్రెస్ సర్కారు చెల్లించిన వడ్డీలు రూ. 55,821 కోట్లు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.55,821 కోట్ల వడ్డీ చెల్లించింది. అలాగే రూ.4500 కోట్ల గ్యారెంటీ రిడెంప్షన్ ఫండ్ (జీఆర్ఎఫ్)లో జమ చేసింది. ఈ ఫండ్ ఏర్పాటు చేయడం ద్వారా ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో రీపేమెంట్ బకాయిలు ఆగిపోకుండా చెల్లింపులకు ఉపయోగ పడుతున్నది. రిస్క్‌తో కూడిన రుణాలు అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధికి జమ చేస్తుందని బడ్జెట్ నివేదికలను బట్టి తెలుస్తున్నది. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులో 27.785 కోట్ల రూపాయల అసలు చెల్లింపులు చేసింది. 2023 డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి 31 వ తేదీ వరకు రూ. 8,650 కోట్ల వడ్డీ, రూ. 1,578 కోట్ల అసలు చెల్లించారు. నాలుగు నెలల కాలంలో రేవంత్ రెడ్డి సర్కారు చేసిన అప్పు కాగ్ లెక్కల ప్రకారం రూ. 11,414 కోట్లు. ఆ తరువాత 2024–25లో రూ.56,209 కోట్లు, 2025–26లో రూ.67,539 కోట్ల రుణం రేవంత్ సర్కారు తీసుకున్నది. వీటికి అదనంగా కేంద్ర ప్రభుత్వ రుణాలు, ఇతర రుణాలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు రూ. 49,461, పెన్షనర్లకు రూ.13,110 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ కాకుండా నేరుగా పర్మినెంట్ ఉద్యోగులు 5,20,368 మంది ఉన్నారు. వీరికి ఏడాదికి వేతనాల కింద రూ.49,461 కోట్లు చెల్లిస్తున్నట్లు బడ్జెట్ పత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పెన్షనర్లు 2,94,944 మంది ఉన్నారని, వీరికి ఏడాదికి రూ.13,110 కోట్లు చెల్లిస్తున్నట్లు బడ్జెట్ పత్రాలు వెల్లడించాయి. మొత్తంగా 8,15,312 మందికి ఏడాదికి రూ.62,571 కోట్లు చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
