DGP Jitender : రేపటి వరకు గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగే అవకాశం:డీజీపీ జితేందర్
హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని డీజీపీ జితేందర్ తెలిపారు. రేపటి వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ డీజీపీ జితేంద్ర తెలిపారు. శనివారం నాడు ఆయన గణేష్ విగ్రహాల శోభాయాత్రను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందన్నారు.సాయంత్రం లోపుగా బాలాపూర్ గణేషుడి విగ్రహం నిమజ్జనం పూర్తయ్యేలా ప్లాన్ చేసినట్టు ఆయన తెలిపారు.నిమజ్జనం కోసం ప్రత్యేక బలగాలు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. నిమజ్జనం కోసం తమ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా భక్తులు తమకు సహకరించాలని ఆయన కోరారు. నిమజ్జనం రేపటి వరకు కొనసాగుతోందని ఆయన చెప్పారు.సున్నిత ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. రికార్డుల ప్రతిష్టించిన విగ్రహాల్లో ఇప్పటికే 80 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తైందని ఆయన వివరించారు. 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడి విగ్రహాలను నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ కు తరలిస్తున్నారు. ఇవాళ కనీసం 50 వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. నిమజ్జనం బందోబస్తులో 30 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర సాగే దారి పొడవునా సీసీకెమెరాలతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు శోభాయాత్రను పరిశీలిస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ ఉదయం నుంచి ఈ నెల 8 వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.