2018 ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేలు వీరే..

  • Publish Date - October 13, 2023 / 11:43 AM IST

విధాత‌: పంచాయ‌తీ ఎన్నిక‌ల నుంచి మొద‌లుకుంటే.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ‌ర‌కు పోటీ చేసే ప్ర‌తి అభ్య‌ర్థి గెల‌వాల‌నుకుంటారు. గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తారు. ఓట‌ర్ల‌ను అంద‌ర్నీ ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తారు. భారీ మెజార్టీతో గెలుపొందాల‌ని క‌ల‌లు కంటుంటారు. ప్ర‌త్య‌ర్థిపై భారీ మెజార్టీతో గెలిచి, రికార్డులు సృష్టించాల‌నుకుంటారు. ఎందుకంటే ఎంత ఎక్కువ మెజార్టీ సాధిస్తే.. అంతెక్కువ కిక్కు వ‌స్తుంది కాబ‌ట్టి. అంతేకాదు.. త‌న బ‌ల‌మేంటో కూడా ఆ ఫ‌లితంతో తేలిపోయి, ప్ర‌త్య‌ర్థుల‌ను ఉక్కిరిబిక్కిరి చేయొచ్చ‌ని కూడా అనుకుంటారు. అలా భారీ మెజార్టీ సాధించేందుకు ప్ర‌తి నాయ‌కుడు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తారు.


2018 ఎన్నిక‌ల్లో ఆరుగులు అభ్య‌ర్థులు భారీ మెజార్టీ సాధించి, రికార్డు సృష్టించారు. మ‌రో న‌లుగురు అభ్య‌ర్థులు స్వ‌ల్ప ఓట్ల తేడాతో గ‌ట్టెక్కారు. భారీ మెజార్టీ సాధించిన వారిలో హ‌రీశ్‌రావు, ఆరూరి ర‌మేశ్‌, కేటీఆర్, మ‌ల్లారెడ్డి, మొజాం ఖాన్, అక్బ‌రుద్దీన్ ఓవైసీ ఉన్నారు. స్వ‌ల్ప ఓట్ల తేడాతో విజ‌యం సాధించిన వారిలో ఆత్రం స‌క్కు, మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి, కొప్పుల ఈశ్వ‌ర్, కాలేరు వెంక‌టేశ్ ఉన్నారు.


భారీ మెజార్టీతో గెలుపొందిన వారు వీరే..


ఇక 2018 శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్‌రావు దేశంలోనే అతిచిన్న వయసులో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 1,31,295 ఓట్లు నమోదవ్వగా, సమీప ప్రత్యర్థి టీజేఎస్ నేత భవానీ మ‌రికంటి 12,596 ఓట్లు సాధించారు. 1,18,699 ఓట్ల భారీ మెజార్టీతో హ‌రీశ్‌రావు గెలుపొంది, రికార్డు సృష్టించారు.


వర్దన్నపేటలో బీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆరూరి రమేష్ 99,240 ఓట్ల మెజార్టీతో గెలుపొంది, రెండో స్థానంలో నిలిచారు. ఆయన 1,31,252 ఓట్లు కొల్లగొట్టగా… సమీప ప్రత్యర్థి టీజేఎస్ అభ్యర్థి దేవయ్య ప‌గిడిపాటి 32,012 ఓట్లు సాధించారు.


సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ 89 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. కేటీఆర్ 1,25,213 ఓట్లను కొల్లగొట్టగా… ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డి 36,204 ఓట్లతో సరిపెట్టుకున్నారు. 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాన‌ని ఎన్నిక‌ల కంటే ముందే చెప్పిన కేటీఆర్.. అంచనాల కంటే ఎక్కువ ఓట్లే సాధించి, రికార్డు సృష్టించారు.


మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి 87,990 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మ‌ల్లారెడ్డికి 1,67,324 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ అభ్య‌ర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి 79,334 ఓట్లు పోల‌య్యాయి.


బహదూర్‌పురా నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఐఎం అభ్యర్థి మొజాం ఖాన్ 82,518 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మొజాం ఖాన్‌కు 96,993 ఓట్లు సాధించగా, సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ నేత అలీ బక్రీకి 14,475 ఓట్లు వచ్చాయి. వీరిద్ద‌రి మ‌ధ్య ఓట్ల తేడా చాలా ఎక్కువగా ఉన్నా… ఎంఐఎంతో మిత్రత్వం కారణంగా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని నిలబెట్టలేదన్న వాదన వినిపించింది. చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ 80,264 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఓవైసీకి 95,339 ఓట్లు పోలవ్వగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి షెహజాదీ సయ్యద్‌కి 15,075 ఓట్లు వచ్చాయి.


స్వ‌ల్ప ఓట్ల తేడాతో గెలుపొందిన ఎమ్మెల్యేలు వీరే..


ఆసిఫాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఆత్రం స‌క్కు 171 ఓట్ల తేడాతో, ప్ర‌త్య‌ర్థి బీఆర్ఎస్ అభ్య‌ర్థి కోవా ల‌క్ష్మిపై గెలుపొందారు. ఇబ్ర‌హీంప‌ట్నం బీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి 376 ఓట్ల తేడాతో గెలుపొందారు. ధ‌ర్మ‌పురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వ‌ర్ 441 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంబ‌ర్‌పేట బీఆర్ఎస్ అభ్య‌ర్థి కాలేరు వెంక‌టేశ్ 1016 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.