బిల్లులు చెల్తిస్తేనే..ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తు సరఫరా !

విద్యుత్తు బిల్లులు చెల్లించకపోతే ఎత్తిపోతల పథకాలకు కరెంట్ లేదని స్పష్టం.. రైతులకు నీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం.

విధాత, హైదరాబాద్ : విద్యుత్తు బిల్లుల బకాయిలు చెల్లిస్తేనే ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తు సరఫరా చేస్తామంటూ రాష్ట్ర విద్యుత్తు శాఖ నిర్ణయించడం హాట్ టాపిక్ గా మారింది. 33వేల కోట్ల విద్యుత్తు బిల్లు బకాయిలు చెల్లిస్తేనే ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన విద్యుత్తు శాఖ ఈ మేరకు నీటి పారుదల శాఖకు స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సచివాలయంలోఆయా శాఖల ఉన్నతాధికారుల భేటీ జరిగింది. ఇందులో విద్యుత్తు బిల్లులు చెల్లించని పక్షంలో ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తు సరఫరా చేయలేమంటూ విద్యుత్తు అధికారులు స్పష్టం చేశారు.

విద్యుత్తు సంస్థలు ఇప్పటికే రూ.50వేల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్నాయని, ఇందులో రూ.33.659కోట్ల నీటి పారుదల శాఖ నుంచి రావాల్సి ఉందని, బిల్లులు కట్టకుండా24గంటల పాటు విద్యుత్తు సరఫరా కష్టతరం అంటూ విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకు లభించే సౌర విద్యుత్తుతో ఎత్తిపోతల పంపింగ్ చేసుకోవాలంటూ సూచించారు. అంతేకాదు సోలార్ విద్యుత్తు ఉన్న సమయంలో అంటే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఎత్తిపోతల పథకాల మోటర్లు నడపాలని నవీన్ మిట్టల్ సలహా ఇచ్చారు. తద్వారా విద్యుత్తు సంస్థలపై భారం పడబోదన్నారు.

అయితే నీటి పారుదల శాఖ సలహదారు పెంటారెడ్డి మాట్లాడుతూ.. ఎత్తిపోతల మోటార్లను ఉదయం అంతా నడిపి, రాత్రి ఆపేస్తే మోటర్లలోని ఇంపెల్లర్లు చెడిపోతాయని పేర్కొన్నారు. గతంలో ఇలా చేస్తే కాళేశ్వరం ప్యాకేజీ 6, 8లో రామగుడులోని పంపులు దెబ్బతిన్నాయని, మరమ్ముతులకు రూ.25కోట్లు ఖర్చు అయ్యిందని తెలిపారు. నిరంతరం మోటార్లు నడకపోతే ఎత్తిపోతల పంప్ లు దెబ్బతింటాయని పెంటారెడ్డి చెప్పగా..అయితే బిల్లులు చెల్లించి పంపులు నడిపించుకోవాలంటూ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. మరోవైపు గ్రావిటీ ద్వారా వచ్చే నీరు వరి సాగుకు ఎలా సరిపోతుందని, పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వస్తుందన్న వాదన సైతం వ్యక్తమైంది.

బీఆర్ఎస్ నిర్వాకంతోనే ఎత్తిపోతల భారం : మంత్రి భట్టి

ఇరువర్గాల వాదన విన్న మంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నిర్వాకంతో ఎత్తిపోతల పథకాలు ఐరావతంలా మారి..వాటి నిర్వహణ భారమైపోతుందని అసహనం వెలిబుచ్చారు. ఇప్పటికే నిధులన్ని అప్పులు, వడ్డీలకే సరిపోతున్నాయని,ఎత్తిపోతల నిర్వహణ సమస్యపై ఓ మధ్యేమార్గ పరిష్కారం చూడాలని భట్టి సూచించారు.

తాగునీటి అవసరాలకే వాడాలి: మంత్రి ఉత్తమ్

విద్యుత్తు బిల్లుల భారం నేపథ్యంలో ఇకపై కేవలం తాగు నీటి కోసమే ఎత్తిపోతల మోటర్లు వాడాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వరి సాగుకు ప్రాజెక్టుల నుంచి గ్రావిటీ నీటిని వాడితే మంచిదన్నారు. ఎత్తిపోతల సమస్యలపై అన్ని కోణాల్లో ఆలోచించి పంపులు నడిపించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

గత బీఆర్ఎస్ పాలకులు ఇంజనీర్లు అవతారం ఎత్తి.. ఇష్టారాజ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ లు సహా పలు ఎత్తిపోతల పథకాలను అడ్డందిడ్డంగా నిర్మించి మోటార్లు, పంప్ లను పాడిచేసిన చరిత్ర వారిదేనన్నారు. ఇప్పుడు మోటార్లు పాడుచేస్తున్నారంటూ మాపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వారి నిర్వాకాన్ని కప్పిపుచ్చుకుని మాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

లైవ్ లో పులుల వేట..అభయారణ్యంలో మనుషుల అతి!
అకిరా పుట్టినరోజు.. మార్క్ శంకర్ పునర్జన్మ: పవన్‌ భార్య లెజినోవా ఎమోషనల్‌

Latest News