విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగులు,పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు ప్రక్రియపై సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఈ పథకానికి సంబంధించి ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు.ట్రస్ట్ కమిటీని రేపు ప్రకటించే అవకాశముంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్టుకు సీఈవోగా నియమిస్తారు. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే 31వ తేదీలోపు డిజిటల్ హెల్త్ కార్డుల కోసం ఉద్యోగుల డేటా అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్‌లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
