దేవాదాయ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు

: తెలంగాణ దేవాదాయ శాఖలో 48 మంది ఉద్యోగులకు గ్రేడ్ 3 ఈవోలుగా, ఇద్దరికి గ్రేడ్ 2, ఒకరికి గ్రేడ్ 1 ఈవోలుగా పదోన్నతి కల్పించారు. ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రజాప్రభుత్వం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈవోలుగా 168 మందికి ఉత్తర్వులు అందజేసిందని, తాజాగా మరింత మంది ఉద్యోగులక పదోన్నతులు కల్పించామని తెలిపారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ దేవాదాయ శాఖలో 48 మంది ఉద్యోగులకు గ్రేడ్ 3 ఈవోలుగా, ఇద్దరికి గ్రేడ్ 2, ఒకరికి గ్రేడ్ 1 ఈవోలుగా పదోన్నతి కల్పించారు. బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియం (దేవులపల్లి రామానుజరావు కళామందిరం) వేదికగా పదోన్నతులు పొందిన ఉద్యోగులకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉత్తర్వులు అందచేశారు. అలాగే 15మంది అర్హులైన అర్చకులకు /వారి కుటుంబ సభ్యులకు పదవీ విరమణ, డెత్ గ్రాట్యుటీ, వివాహ రుణం మంజూరు చేస్తూ ఉత్తర్వుల అందజేశారు.

ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రజాప్రభుత్వం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈవోలుగా 168 మందికి ఉత్తర్వులు అందజేసిందని, తాజాగా మరో 48మందికి పదోన్నతులు కల్పించిందని వెల్లడించారు. పది రోజుల క్రితం రవీంద్రభారతి వేదికగా వేదపండితులు, అర్చకులు, పరిచారకులు, డోలు, సన్నాయి కళాకారులు తదితర 191 ధార్మిక నియామక ఉత్తర్వులు అందజేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కులను కాపాడటంలో, వారికి దక్కాల్సిన ప్రయోజనాలను అందించడంలో ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో దేవాదాయశాఖ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా కార్యాచరణను అమలుచేస్తున్నామని తెలిపారు.

అర్చక సంక్షేమ నిధి కింద పదవీ విరమణ, మరణ గ్రాట్యుటీని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడంతో పాటు అంత్యక్రియల సహాయాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచి అర్చక కుటుంబాలకు మరింత భరోసా కల్పించామని మంత్రి తెలిపారు. సరస్వతి నది ఆది, అంత్య పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామని, గోదావరి పుష్కరాలు (2027), కృష్ణ పుష్కరాలు (2028) కోసం ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పుష్కరాలు అంటే తెలంగాణ అనే స్థాయిలో రానున్న పుష్కరాలు చేపడతామని మంత్రి సురేఖ అన్నారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ డైరక్టర్ హనుమంతరావు, రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (SITA) డైరక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు, ఆర్జెసి రామకృష్ణారావు, డిప్యూటి కమిషనర్ వినోద్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు జ్యోతి, శ్రీనివాస్, ఈవోల సంఘం అధ్యక్షుడు నరేందర్, టెంపుల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగారెడ్డి, తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగ జాక్ కన్వీనర్ డి.వి.ఆర్.శర్మ, పలువురు దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులు లభించడంతో దేవాదాయ శాఖ ఉద్యోగులు ఈ సందర్బంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Latest News