Krishna reservoirs | కృష్ణా నీటి తరలింపుపై జూలై9న ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Krishna reservoirs | ఏపీకి కృష్ణా జలాశయాలు అక్రమంగా తరలింపుతో పాటు బీఆర్ఎస్ పాలనలో తుమ్మడిహాట్టి నుండి మెడిగడ్డ కు ప్రాజెక్టు మార్చిన అంశంపై బుధవారం జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు రాజ్యసభ, లోకసభ,శాసనమండలి,శాసనసభ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ లు, కార్పొరేషన్ చైర్మన్ లకు నీటిపారుదల రంగ నిపుణులకు,అధికారులకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు అంద జేశారు. తుమ్మడిహాట్టి నుండి మెడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంతో ఏర్పడిన దురదృష్టకరమైన పరిణామాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు. విరివిగా ఆ ప్రాజెక్టు మార్పు పై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేసేందుకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజ్ ల రూపకల్పన,నిర్మాణాలలో ఏర్పడ్డ సాంకేతిక అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టును మార్చడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారిన అంశాన్ని కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించనున్నారు.