ఈసీకి అధికారుల లిస్ట్ పంపిన ప్ర‌భుత్వం

  • Publish Date - October 12, 2023 / 01:52 PM IST

విధాత‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో బుధ‌వారం ఖాళీ అయిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టుల‌లో కొత్త‌వారితో భ‌ర్తీ చేసేందుకు ఒక్కో పోస్ట్‌కు ముగ్గురు అధికారుల చొప్పున లిస్ట్‌ను రూపొందించిన రాష్ట్ర ప్ర‌భుత్వం గురువారం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు పంపింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ లిస్ట్ నుంచి ఒక్కో అధికారి పేరును ఎంపిక చేసి నియ‌మించ‌నున్న‌ది.


రాష్ట్రంలో బీఆరెస్ ప్ర‌భుత్వం త‌న‌కు అనుకూల‌మైన అధికారుల‌ను కీల‌క స్థానాల‌లో నియ‌మించింద‌ని, త‌ద్వారా ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకు ప్ర‌య‌త్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర ఎన్నిక‌ల బృందానికి ఏయే అధికారులు బీఆరెస్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉందో తెలియ‌జేస్తూ ఒక లిస్ట్‌ను కూడా ఇచ్చింది.


దీనిపై అంత‌ర్గ‌త విచార‌ణ చేసుకున్న క‌మిష‌న్ బుధ‌వారం సీనియ‌ర్ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌ను బ‌దిలీ చూస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. జిల్లా ఎస్పీ, క‌లెక్ట‌ర్ పోస్టుల‌లో నాన్ క్యాడ‌ర్ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కాకుండా రెగ్యుల‌ర్ రిక్రూట్ అధికారుల‌ను ఎంపిక చేయాల‌ని ఈసీ ఇచ్చిన ఆదేశాల మేర‌కు సీఎస్ లిస్ట్ పంపించిన‌ట్లు స‌చివాల‌య వ‌ర్గాల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.