Medaram Jatara : మేడారానికి నయా వెలుగు
మేడారం అభివృద్ధికి రూ.236.2 కోట్ల మాస్టర్ ప్లాన్, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యటన, ఆదివాసీ ఆచారాలకు పెద్దపీట.

విధాత ప్రత్యేక ప్రతినిధి: ఆకుపచ్చని అడవి మధ్యలో వనదేవతలు కొలువుదీరిన మేడారానికి కొత్త వెలుగు, అభివృద్ధి హంగులు ఒనగూరనున్నాయి. ఆదివాసీ ఆచార, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మేడారంలో రూ.236.2 కోట్లతో రూపొందించిన మాస్టర్ ప్లాను అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఈ మాస్టర్ ప్లాను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్లను భాగస్వామ్యం చేస్తూ శాశ్వత అభివృద్ధి పనులకు పూర్తి ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారు. రెండేళ్ళకోసారి వచ్చే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీసారీ అవసరమైన నిధులు సమకూర్చడం గత కొన్నేళ్ళుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి గతానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో శాశ్వత నిర్మాణాలు చేయాలని, వీటిని ప్రణాళిక బద్ధంగా చేపట్టేందుకు నిర్ణయించి మాస్టర్ ప్లాను రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ ప్లాను రెండు దశల్లో చేపట్టి డిసెంబర్ నాటికి ఒక దశ, మిగిలిన పనులు మరో దశగా విభజించి జాతరలోపు అన్ని పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై పలు దఫాలుగా ప్రజాప్రతినిధులు, అధికారుల కసరత్తు సాగుతోంది. మేడారంలో అభివృద్ధి పై సీఎం రేవంత్ కూడా ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారు. ఇక్కడ పనులు సహజ పద్ధతిలో రాతి కట్టడాలు కట్టేందుకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన తాజాగా సూచించడం గమనార్హం.
తన కేబినేట్లో మంత్రి సీతక్క ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ మేడారం నుంచే పాదయాత్ర ప్రారంభించడం సెంటిమెంట్గా భావిస్తున్నారు. పాదయాత్ర తర్వాత అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి సీఎం కావడంతో వనదేవతలపై విశ్వాసం మరింత బలపడినందున ఈ జాతరకు మనింత ప్రాధాన్యతనిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ వారంలో సీఎం మేడారంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి, మాస్టర్ ప్లాన్ అమలుకు సంబంధించిన తుది మెరుగులు దిద్దే అవకాశం ఉన్నది. ఈ మేరకు సీఎం ఈ విషయం సోమవారం స్పష్టం చేశారు.
రూ.236.2 కోట్లతో ప్రణాళిక
మేడారం అభివృద్ధికి రూ.236.2 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందులో రూ.150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేయగా, మిగిలిన అవసరమైన నిధులను వివిధ శాఖల ద్వారా సమకూర్చుకోనున్నట్లు ప్రకటించారు. ఈ నిధుల్లో గద్దెల అభివృద్ధికి రూ. 58.2 కోట్లు,- గద్దెల వద్ద కళాకృతి పనులకు రూ. 6.8 కోట్లు,- జంపన్న వాగు అభివృద్ధి కోసం రూ. 39 కోట్లు, భక్తుల వసతి సౌకర్యాలకు రూ. 50 కోట్లు, రోడ్ల అభివృద్ధి నిమిత్తం రూ. 52.5 కోట్లు కేటాయించారు. మిగిలిన నిధులు జాతరకు అవసరమైన ఇతర ఖర్చుల నిమిత్తం ఖర్చుచేయనున్నారు. వంద రోజుల్లో ఈ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
ఆదివాసీ ఆచారాలకు పెద్దపీట
మేడారం మాస్టర్ ప్లాన్లో చేపట్టే అభివృద్ధి పనులను, చేర్పులు, మార్పులను మేడారం వడ్డెల (పూజారులు) అభిప్రాయాల ప్రకారం రూపొందించారు. వడ్డెల సూచన మేరకు ప్రస్తుతం ఉన్న సమ్మక్క, సారలమ్మ గద్దెల ఎత్తు పెంచాలని భావిస్తున్నారు. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తుల రాకపోకలతోపాటు పార్కింగ్కు అత్యంత ప్రాధాన్యతనివ్వనున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జంపన్నవాగుల్లో నిత్యం నీరు నిల్వా ఉండే విధంగా చెక్ డ్యాం ల నిర్మాణం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ, వసతి సౌకర్యాలు, గెస్ట్ హౌజ్లు తదితర వాటి నిర్మాణానికి ప్రాధాన్యత నివ్వనున్నారు. ఇందులో వడ్డెలకు కూడా తగిన ప్రాధాన్యతనివ్వాలని భావిస్తున్నారు. ఈ మాస్లర్ ప్లాన్ పనులు జాతరలోపు చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.