Telangana High Court : అనుమతి లేకపోతే కేబుల్ వైర్లు తొలగించవచ్చు
తెలంగాణ హైకోర్టు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగించాలంటూ ఆదేశం జారీ చేసింది, విద్యుత్ ప్రమాదాలను తగ్గించేందుకు.

Telangana High Court | అనుమతి లేకపోతే కేబుల్, ఇంటర్నెట్ వైర్లను కట్ చేయవచ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సోమవారం కేబుల్, ఇంటర్నెట్ వైర్ల తొలగింపుపై తెలంగాణ హైకోర్టు విచారించింది. శ్రీకృష్ణా జన్మష్టమిని పురస్కరించుకొని రథం ఊరేగింపు చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగి హైదరాబాద్ రామంతాపూర్ వద్ద ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విద్యుత్ స్థంభాలకు ఉన్న ఇంటర్నెట్, కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. అయితే దీనిపై ఎయిర్ టెల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనుమతి తీసుకున్న కేబుళ్లను సైతం తొలగిస్తున్నారని ఆరోపించింది. అయితే ఏయే విద్యుత్ స్థంభాలకు అనుమతి తీసుకున్నారో చెప్పాలని విద్యుత్ శాఖ తరపు న్యాయవాది ఎయిర్ టెల్ సంస్థ న్యాయవాదిని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కేబుళ్లను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వినాయక చవితిని పురస్కరించుకొని వినాయక విగ్రహాల తరలింపు సమయంలో కూడా ఇటీవల హైదరాబాద్ నగరంలో రెండు మూడు చోట్ల విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. దీంతో నగరంలో విద్యుత్ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ పెట్టారు.