విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ బండ్లగూడలోని సర్వే నెంబర్ 62లో ఉన్న సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ నిర్మించిన వివాదంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మించినప్పటికీ ఫాతిమా ఒవైసీ కాలేజీపై బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ విజయ్ గోపాల్ అనే న్యాయవాది గతంలో ప్రజాప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. సల్కం చెరువులో ఉన్న ఒవైసీ విద్యాసంస్థల నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని ఏప్రిల్ 13వ తేదీన ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలోని ఉన్నత న్యాయస్థాన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది.
వివాదాస్పద విద్యా సంస్థకు అసలు ఎలా అనుమతులు మంజూరు చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. పాఠశాల విద్యాశాఖ తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది వెంకట్‌రాజు గౌడ్ సమాధానం ఇస్తూ.. ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదని కోర్టుకు వెల్లడించారు. ఈ సమాధానంపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. కనీస అనుమతులు లేనప్పుడు ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లు, విద్యా సర్టిఫికెట్లు ఎలా అందుతున్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అందుకు ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ ఇతర గుర్తింపు పొందిన కాలేజీలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు కేవలం ఈ ఫాతిమా కాలేజీలో అకామిడేషన్ మాత్రమే తీసుకుంటున్నారని, వారి హాల్‌టికెట్‌లు, సర్టిఫికెట్లు అన్నీ అనుమతి ఉన్న ఇతర సంస్థల నుంచే జారీ అవుతున్నాయని కోర్టుకు వివరించారు.
ప్రభుత్వ యంత్రాంగం సమాధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. సదరు విద్యాసంస్థ భవన నిర్మాణానికి కనీసం జీహెచ్‌ఎంసీ నుంచి అయినా అనుమతి ఉందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. భవన నిర్మాణ అనుమతులు, సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ వంటి అత్యంత కీలకమైన అంశాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని గతంలోనే మూడు నెలల సుదీర్ఘ సమయం ఇచ్చినప్పటికీ బాధ్యతాయుతమైన ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సంబంధం లేదని హెచ్ఎండీఏ, SIR ప్రక్రియలో బిజీగా ఉన్నామని మరో నాలుగు వారాల సమయం ఇవ్వాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు స్కెచ్ ఇవ్వలేదని నీటి పారుదల శాఖ, మరో వారం సమయం కావాలని విద్యా శాఖ తెలపడం పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భవన అనుమతులపై మూడు నెలలుగా జీహెచ్‌ఎంసీ స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చివరి అవకాశంగా వారం రోజుల్లోగా పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీ, విద్యాశాఖ సహా సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా కౌంటర్లు దాఖలు చేయని పక్షంలో ఈనెల 9 నాటికి కోర్టు వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని, రికార్డులను ఆధారంగా చేసుకుని తుది ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది.
