BC Reservations | హైకోర్టు స్టేతో బీసీల్లో అంతర్మథనం

BC Reservations | కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత బీసీల ఆశలపై నీళ్ళు చల్లుతూ హైకోర్టు స్టే ఇవ్వడంతో గతంలో ఎన్నడూలేని విధంగా బీసీల్లో అంతర్మథనం ప్రారంభమైంది.

BC Reservations | హైకోర్టు స్టేతో బీసీల్లో అంతర్మథనం

క్రమంగా పెరుగుతోన్న ‘చైతన్యం’
‘రాజకీయ’ బీసీల్లో పార్టీ వాదం
బీసీ సంఘాల్లో కరువైన ఐక్యత
పరాధీనంలో బీసీ సంఘాల నేతలు!
బీసీలంటే లెక్కలేని ప్రధాన పక్షాలు

BC Reservations | విధాత, ప్రత్యేక ప్రతినిధి : కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత బీసీల ఆశలపై నీళ్ళు చల్లుతూ హైకోర్టు స్టే ఇవ్వడంతో గతంలో ఎన్నడూలేని విధంగా బీసీల్లో అంతర్మథనం ప్రారంభమైంది. నోటిఫికేషన్‌తో చిగురించిన ఆశలు చేజారిపోవడంతో బీసీల్లో తీవ్ర తర్జనభర్జన సాగుతోంది. తమ స్వంత ప్రయోజనాల కోసమైనా బీసీ సంఘాలు, పార్టీల్లోని బీసీ నేతలు బీసీ సానుకూల భజన ప్రారంభించడంతో తీవ్ర చర్చసాగుతోంది. ఇదే బీసీల్లో చైతన్యాన్ని పెంచేందుకు దోహదం చేస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

జనాభాలో 56 శాతం.. అయినా వెనుకబాటే

జనాభాలో 56శాతం పైగా ఉన్న బీసీలు ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో బీసీలకు దక్కాల్సిన వాటా దక్కడంలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగిన చిన్న ప్రయత్నానికి ప్రధాన పక్షాల్లోని అగ్రకుల నాయకత్వం తెరచాటు రాజకీయాలతో మోకాలడ్డుతుండగా రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు గవర్నర్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం ఫలితంగా హైకోర్టులో అడ్డంకులు తప్పలేదు. దీనికంతటికి బీసీల్లో అనైక్యత ప్రధాన కారణమనే భావన ప్రస్తుతానికి పెరుగుతోంది. ఆ అనైక్యతే ఇతర ఆధిపత్యకులాలకు అనుకూలంగా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీసీల్లోఅనైక్యతే అవరోధం

చుట్టూ శాఖాహారులేగానీ నడుమ కోడిపిల్ల మాయమైనట్లుగా రాష్ట్రంలో ఇప్పుడు బీసీల పరిస్థితి మారింది. అందరూ ప్రధాన నేతలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కావాలంటున్నట్లు పోజులు కొడుతున్నారు. మరి ఎవరి అడ్డంకి వల్ల తాజా పరిస్థితి ఏర్పడిదంటే ఒకరిపై మరొకరు నెపంనెడుతూ, సారాంశంలో బీసీలకు రావాల్సిన హక్కులను కాలరాయడంలో, రాకుండా చేయడంలో విజయవంతమవుతున్నారనే వాదన పెరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 42శాతం రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించడంతో ప్రతీ సందర్భం బీసీల్లో కాస్తోకూస్తో అవగాహన పెంచేందుకు ఉపయోగపడుతోందంటున్నారు. బీసీ సంఘాల తీరు, అందులోని స్వార్ధపూరిత నాయకుల సర్కస్‌ఫీట్‌లు, పార్టీ నాయకత్వాల జిమ్మిక్కులు, పార్టీల్లోని బీసీ నాయకుల మాటలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు అవకాశం ఏర్పడిందంటున్నారు. ముఖ్యంగా విద్యార్ధి, యువతలో ఈ చర్చ జోరు పెరిగింది. 42 శాతం రిజర్వేషన్ల అమలులో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాల్లో రాజకీయ స్వార్ధముండొచ్చేమోగానీ, సహకరించాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వాల తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాన పార్టీల ముఖ్య నేతల ద్వంద్వ ప్రమాణాలు

ఇదిలా ఉండగా కొందరు ప్రధాన పార్టీల ముఖ్యనాయకులు ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే కాకుండా బహిరంగంగా సన్నాయి నొక్కులు నొక్కుతూ వ్యాఖ్యలు చేయడంలోనే బీసీలంటే కనీస గౌరవం, వారంటే భయం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బీసీలు ఐక్యంగా ఉంటే ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పటికే తలొగ్గి సానుకూల నిర్ణయాలకు సంపూర్ణ మద్ధతు నందించేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, బీసీల అనైక్యత, నాయకుల పార్టీ తాబేదారు తనం, బీసీ సంఘాల్లోని కొందరు నేతల దళారీ స్వభావం.. వెరసి ఆధిపత్య కులాలు అధికంగా ఉన్న రాజకీయ పక్షాల చేతిలో పావులుగా మారుతున్నారంటున్నారు. ఈ నాయకులు నోటితో మద్ధతుతెలియజేస్తూ నొసటితో వెక్కిరిస్తున్నందున బీసీలకు అన్యాయం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హై కోర్టు స్టే రాగానే నిన్నటి వరకు నోరెత్తని కొన్ని రాజకీయ పక్షాలు తమ ‘రాజకీయ’ ప్రయోజనాన్ని కాపాడుకునేందుకు కొత్త ఎత్తుగడలువేస్తూ మరోసారి బీసీ వర్గాలను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బీసీలను మరింత ఐక్యం చేస్తుందా?

తాజా రాజకీయ పరిణామాలు బీసీల్లో చర్చను లేవనెత్తగా రానున్న రోజుల్లో ఇది రాష్ట్ర రాజకీయాల్లో బీసీల పాత్రను పెంచడమో? లేకుంటే బీసీల్లో ఐక్యతను పెంపొందిస్తూ సంఘటితంగా మార్చేందుకు పునాదులు వేసే ప్రయత్నం సాగే అవకాశం ఉందంటున్నారు. ఏ రాజకీయ భావజాలాన్ని కలిగి ఉన్నప్పటికీ బీసీల్లో ఐక్యత సాధించనంత వరకు తమ ప్రయోజనాలు రాబట్టుకోలేరనే స్పృహ ఇటీవల పెరుగుతోందంటున్నారు. ఈ చైతన్యమే రానున్న రోజుల్లో అవకాశవాద రాజకీయాలకు చెక్పెట్టేందుకు దోహదం చేస్తుందంటున్నారు. ఈ రిజర్వేషన్ల ఫలితం సైతం బీసీల్లోని కొన్ని కులాలకు మాత్రమే లాభిస్తుందనే అభిప్రాయం మరో వైపు ఉంది. కొందరు మాత్రమే లభించే ఈ కాస్తా ఫలాలు ఎగురేసుకపోతున్నారనే విమర్శలున్నందున బీసీల్లో కూడా సామాజిక సమానత్వసాధనకు కృషి సాగించినపుడే ఐక్యత సాధ్యమవుతోందని లేకుంటే ఈ అనైక్యతే, విభజనే ఇప్పటికే నాయకత్వ స్థానాల్లో ఉన్న ఆధిపత్యకులాలకు ఆయుధమవుతోందనే అభిప్రాయం క్రమంగా పెరుగుతోంది.