విధాత : ప్రజా సమస్యలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్లు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో అత్యవసర సేవలకు ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్లు ఇస్తుండటం సాధారణంగా చూస్తుంటాం. అలా ప్రభుత్వమే జారీ చేసిన ఫోన్ నెంబర్లు ఎప్పుడు బిజీ అని చెబుతూ.. పనిచేయకుండా పోతే ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని అయోమయం ఎదుర్కొనక తప్పదు. సరిగ్గా అలాంటి పరిస్థితే ఇప్పుడు ప్రజాసమస్యలను వెలుగులోకి తెచ్చి..ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసి..వైఫల్యాలను ఎండగట్టే జర్నలిస్టులకు సైతం ఎదురైంది.
తెలంగాణ ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఏవైనా తప్పులు దొర్లినా లేదా ఏదైనా డాక్యుమెంట్ అప్ లోడ్ చేయకపోయినా , దానిని సరి చేసేందుకు లేదా పూర్తిగా తొలగించి కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు హెల్ప్ లైన్ నెంబర్ పేరిట 9154170881 అనే ఫోన్ నెంబర్ ను జారీ చేశారు. ఆ నెంబర్ కు తమ దరఖాస్తుల నిమిత్తం అవసరమైన సమాచారం, సవరణల కోసం జర్నలిస్టులు సంప్రదించేందుకు ప్రయత్నిస్తే…ఆ నెంబర్ నిరంతరం బిజీ అని వస్తుంది. దీంతో అక్రిడిటేషన్ దరఖాస్తుల సమర్ఫణలో ఎదురైన తమ సమస్యలపై ఎవరినికి సంప్రదించాలొ?..ఎలా పరిష్కరించుకోవాలో ? తెలియని గందరగోళ పరిస్థితిని జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ఈ సమస్యపై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరుతున్నారు.
ఇప్పటికే కొత్త అక్రిడిటేషన్ల కోసం అనేక నిబంధనలు..ఆంక్షల కొర్రీలు విధించిన ప్రభుత్వం తీరుపై జర్నలిస్టులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఓ వైపు కోట్ల విలువ చేసే భూములను అఫిడవిట్ లతో రిజిస్ట్రేషన్లు చేస్తామంటున్న ప్రభుత్వం.. మరోవైపు జర్నలిస్టుల అక్రిడిటేషన్ల మంజూరీకి మాత్రం కఠిన నిబంధనలు విధించడం విడ్దూరంగా ఉందంటున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూ ఆన్ లైన్ లో కొత్త అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడంలో తిప్పలు పడుతున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ పనిచేసేలా చూడాలని జర్నలిస్టులు కోరుతున్నారు.
నిరంతరంగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ల దరఖాస్తుల ప్రక్రియ
జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో పరిశీలించి.. అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. కొత్త కార్డుల కోసం అర్హులైన జర్నలిస్టు ఆన్ లైన్ లో తమ దరఖాస్తులను అప్ లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ మాసంలో అక్రిడిటేషన్ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఈనెలలోనే జిల్లా కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు జారీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో దరఖాస్తు చేసుకొనే అర్హులైన జర్నలిస్టులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్ లైన్ చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు.
ఇవి కూడా చదవండి :
నాగుపామును పట్టుకుని..నీళ్లు తాగించాడు!
Actress | అభిమానం హద్దులు దాటితే ప్రమాదం .. హీరోయిన్‌కి లేడి ఫ్యాన్ లిప్ లాక్ ఇవ్వడమేంటి?
