విధాత, హైదరాబాద్ : తెలంగాణలో సవరించిన భూముల మార్కెట్ విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల మార్కెట్ విలువల సవరణకు ఆమోదం తెలిపిందని, క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ల ధోరణి, డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని భూముల విలువల సవరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టామన్నారు. నిపుణుల సూచనలు, అధికారుల సలహాలతో భూముల విలువ పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రాంతాలవారీగా మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్లు పరిశీలించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
భూ లావాదేవీలలో పారదర్శకత కోసమే సవరణ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమగ్ర కసరత్తు లేకుండా, అశాస్త్రీయ పద్దతుల్లో 2021-22 సంవత్సరాల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండు సార్లు భూముల ధరలను పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సవరణలు క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా కేవలం శాతం గణనల ఆధారంగా, పట్టికల ప్రకారం చేపట్టడం వల్ల కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా విలువలు నిర్ణయించబడ్డాయని తెలిపారు. వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ అంతరం ఉండటం వల్ల భూ లావాదేవీలలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు భూముల విలువ సవరణ చేపట్టామని తెలిపారు.
రాష్ట్రంలోని 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో పెంపు
భూలావాదేవీల్లో సమస్య పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా పునఃపరిశీలన చేశాం అని, 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువలపై సమీక్ష జరిపాం అని మంత్రి పొంగులేటి తెలిపారు. గ్రామీణ, పట్టణ మార్కెట్ విలువల సవరణ కమిటీలు అధ్యయనం చేశాయి. అభివృద్ధి, భూముల డిమాండ్, మార్కెట్ పరిస్థితులు, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్, కొత్త రోడ్లు, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని మార్కెట్ విలువ సవరించాం అని వెల్లడించారు. ఫ్లాట్ల విషయంలో అసమానతలు తొలగిస్తూ కొన్ని చోట్ల అన్ని అంతస్తులకు ఒకే ధర ఉంటుంది. ఇప్పటికే అధిక ధర ఉన్నచోట పెంపు ప్రతిపాదనలు లేవు. హెచ్‌ఎండీఏ, క్యూర్, ఇతర ప్రాంతాలకు ప్రాథమిక మార్కెట్ రేట్లు నిర్ణయించాం.
వ్యవసాయ, ప్లాట్లు, ఫ్లాట్లకు కొత్త కనీస రేట్లు
వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కొత్త కనీస రేట్లు ఖరారు చేశాం. 2021 తర్వాత నిర్మాణ వ్యయాలు సవరించడంతో కొత్త ధరల అవసరం ఏర్పడింది. ఆర్‌సీసీ, నాన్-ఆర్‌సీసీ నిర్మాణాలకు సంబంధించిన విలువల్లో మార్పులు చేసింది. భూ లావాదేవీల్లో పారదర్శకతను పెంచడం, మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను నిర్ణయించడం ఈ సవరణల ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకతతో సవరణలు చేపట్టాం అని మంత్రి తెలిపారు.