Telangana HC On BC Reservations | స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్
తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని సవాల్.

విధాత : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతల మండలం కేశవాపూర్ కు చెందిన సామాజిక కార్యకర్త, రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 3 ఉత్తర్వులను ఆయన సవాల్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ..మొత్తం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి 50శాతం దాటకుండా ఆదేశించాలంటూ తన పిటిషనలో కోరారు.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో రిజర్వేషన్లు 50శాతం మించకుండా పరిమితి విధించారని..దాన్ని కొనసాగించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అందులో ఉన్న విధంగా బీసీలకు 26శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 9శాతం మొత్తం 50శాతం వరకే రిజర్వేషన్లు పరిమితం చేయాలని కోరారు. ఓవైపు స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించడంతో .. కోర్టు రిజర్వేషన్లపై ఏ నిర్ణయం తీసుకుంటుంది…స్థానిక ఎన్నికల నిర్వహణ పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిఇలా ఉండగా..మూడు రోజుల క్రితం మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను రిజర్వేషన్ జీవోలు రాకముందే పత్రికా కథనాల ఆధారంగా పిటిషన్లు వేయడం సరికాదంటూ హైకోర్టు వారి పిటిషన్ ను కొట్టివేయడం గమనార్హం.