Shivadhar Reddy : తెలంగాణ కమిటీలో ప్రస్తుతం 73 మంది మావోయిస్టులు ఉన్నారు

తెలంగాణ కమిటీలో 73మంది మావోయిస్టులు ఉన్నారని ఇంటెలిజెన్స్ డీజీ వెల్లడించారు. వారిలో 11 మంది తెలంగాణవారేనని తెలిపారు.

Shivadhar Reddy : తెలంగాణ కమిటీలో ప్రస్తుతం 73 మంది మావోయిస్టులు ఉన్నారు

విధాత, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీలో ప్రస్తుతం 73మంది ఉన్నారని..అందులో 11మంది తెలంగాణ వాళ్లు, 62 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఇతర రాష్ట్రాల్లో కేసులు ఉంటే ఆ రాష్ట్రాల వారితో మాట్లాడతాం అని..లొంగిపోయిన మావోయిస్టుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని కోరుతాం అని పేర్కొన్నారు.

తెలంగాణ మావోయిస్టులతోనే సవాల్

దేశంలో 2026 మార్చి 31నాటికి మావోయిస్టుల నిర్మూలించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తెలంగాణకు చెందిన అగ్రనేతలే ప్రధాన అవరోధమని..వారిని అంతమొందిస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటామని..లేదంటే పరిస్థితి మరోరకంగా ఉంటుందనే ఆందోళన కేంద్ర ప్రభుత్వ, భద్రతా దళాల్లో నెలకొంది. జనవరిలో చలపతి, మేలో నంబాల కేశవరావు, జూన్‌లో తెంటు సుధాకర్‌ వంటి అగ్రనేతలు చనిపోవడంతో మావోయిస్టు పార్టీలో కీలక స్థానాల్లో ఏపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే 21 ఏళ్ల మావోయిస్టు పార్టీ చరిత్రలో తీవ్రమైన ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొంటూ గెరిల్లా పంథాలో సాయుధ విప్లవ పోరాటాన్ని నడిపించడంలో తెలంగాణ నేతలు మిగిలిన వారి కంటే మిన్నగా ఉన్నారనేది ప్రభుత్వ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో తెలంగాణ మావోయిస్టుల నేతలే టార్గెట్‌గా భవిష్యత్తు ఆపరేషన్లు కొనసాగనున్నట్టు తెలుస్తోంది.

కొత్త సారధి తెలంగాణ నుంచే

మావోయిస్టు పార్టీ నూతన ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకే చెందిన తిరుపతి అలియాస్ దేవ్ జి, బస్తర్ కమాండర్ గా గెరిల్లా సుప్రీం లీడర్ మాడ్వి హిడ్మా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా విడుదల చేసిన ప్రకటనలో సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) కేంద్ర కమిటీ 21వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అందులో ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ 366మంది పార్టీ నాయకులను, సభ్యులను కోల్పోయినట్లుగా తెలిపింది. ఆ తర్వాత బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లాకు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ సహా మెుత్తం 10 మంది మృతిచెందారు. ఆ తర్వాత మరో ఇద్దరు ఎన్ కౌంటర్ అయ్యారు. దీంతో ఆపరేషన్ కగార్ లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 378కి చేరింది.