హైదరాబాద్: తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో పీఎల్జీఏ బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు కూడా ఉన్నారు. 42 మంది మావోయిస్టులు 36 ఆయుధాలతో లొంగిపోయినట్లుగా డీజీపీ వెల్లడించారు. మావోయిస్టులు సరెండర్ చేసిన ఆయుధాల్లో ఐదు ఏకే 47, ఐదు ఎస్ఎల్ఆర్, నాలుగు ఇన్పాస్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలు, గ్రేనెడ్లు, 800గ్రాముల గోల్డ్ బిస్కట్లు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ పెరగడంతో వీరంతా తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణకు చెందిన వారున్నారు. వారిలో డివిజనల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు.
ఇక “మావోయిస్టు రహిత” రాష్ట్రంగా తెలంగాణ!
మావోయిస్టుల తాజాగా లొంగుబాటుతో తెలంగాణలో పీఎల్‌జీఏ బెటాలియన్ పూర్తిస్థాయిలో కనుమరుగైందని, ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక మావోయిస్టు కేడర్ ఎవరూ లేరని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. దీంతో తెలంగాణ ఇప్పుడు పూర్తిస్థాయిలో ‘మావోయిస్టు రహిత’ రాష్ట్రంగా అవతరించిందని గర్వంగా ప్రకటిస్తున్నాను అని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. అడవుల్లో ఇంకా మిగిలి ఉన్న వారు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు 761 మంది మావోయిస్ట్‌లు లొంగిపోయారని మావోయిస్ట్ కీలక నేత గణపతి బతికే ఉన్నాడని డీజీపీ తెలిపారు.
