Telangana | కోలకతా ఘటనలో నిందితులను ఉరి తీయాలి.. ఎంపీల డిమాండ్‌

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ పై హత్యాచారం ఘటనలో నిందితులను ఉరి తీయాలని ఎంపీలు ఈటల రాజేందర్‌, కడియం కావ్యలు డిమాండ్‌ చేశారు.

Telangana | కోలకతా ఘటనలో నిందితులను ఉరి తీయాలి.. ఎంపీల డిమాండ్‌

విధాత, హైదరాబాద్ : కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ పై హత్యాచారం ఘటనలో నిందితులను ఉరి తీయాలని ఎంపీలు ఈటల రాజేందర్‌, కడియం కావ్యలు డిమాండ్‌ చేశారు. చట్టాలను సవరించైనా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా ఉరితీసినా తప్పులేదన్నారు. వైద్యులపై దాడులు జరగకుండా పటిష్ఠమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కోల్‌కతాలో జూనియర్‌ మహిళా డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ)తెలంగాణా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన, ర్యాలీలు నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టారు.

నగర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, జూనియర్‌ డాక్టర్లు వందలాది మంది నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీగా ధర్నా చౌక్‌కు వచ్చి నిరసన తెలిపారు. వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్‌, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు వి.సంధ్య, పీడబ్ల్యూ అధ్యక్షురాలు ఝాన్సీ, ఐఎఫ్టీయూ నాయకురాలు అరుణ తదితరులు హాజరై వైద్యులకు మద్దతు తెలిపారు.ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ పి.కాళీప్రసాదరావు, ప్రధానకార్యదర్శి డాక్టర్‌ విజయారావు. ఫైనాన్స్‌ సెక్రటరీ డాక్టర్‌ ఆర్‌ కే యాదవ్‌, జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ దయాళ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.