Telangana new liquor shops| తెలంగాణలో నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు షురూ!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. కొత్త లైసెన్స్ లు దక్కించుకున్న దుకాణాదారులు ఈ రోజు నుంచి కొత్త మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభించారు. కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ ల గడువు ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30 వరకు(రెండేళ్లపాటు) ఈ అమల్లో ఉంటుంది.

Telangana new liquor shops| తెలంగాణలో నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు షురూ!

విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు(Telangana new liquor shops) ప్రారంభమయ్యాయి. కొత్త లైసెన్స్ లు దక్కించుకున్న దుకాణాదారులు ఈ రోజు నుంచి కొత్త మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభించారు. కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ ల గడువు ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30 వరకు(రెండేళ్లపాటు) ఈ అమల్లో ఉంటుంది. ఈసారి మద్యం లైసెన్స్ దారులకు మంచి వ్యాపారం సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ, పరిషత్‌, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌, సహకార సంఘాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు కొత్త లైసెన్స్ దారుల కాలంలో రెట్టింపు సాగుతాయని ఎక్సైజ్ శాఖ అంచనాలు వేస్తుంది. త్వరలో జరగబోయే మేడారం జాతర వంటి భారీ ఉత్సవాలు కూడా మద్యం అమ్మకాలు భారీగా పెరగడానికి దోహదం చేయనున్నాయి. నూతన సంవత్సరం వేడుకలు ఉండనే ఉన్నాయి. దీంతో కొత్త లైసెన్స్ దారులు ఉత్సాహంగా తమ వ్యాపారం ప్రారంభించారు.

పెరిగిన ఆదాయం

రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల నిర్వహణకు ఒక్కో దరఖాస్తు ధరను రూ.3 లక్షలకు పెంచడం ద్వారా ప్రభుత్వ ఖాజానాకు రూ..2,858 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది. అంతకుముందు ఏడాది కంటే రూ.214 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది. ప్రతి నెలా రూ.1,000 కోట్లకు పైగా ఎక్సైజ్‌ ఆదాయం వస్తుండగా, ఈ అక్టోబర్‌లో ఏకంగా రూ.3,675 కోట్లు వచ్చింది. ఆ నెలలో ఏకంగా రూ. 16 వేల కోట్లకు పైగా పన్ను ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. ఏటా తెలంగాణ ఖజానాకు మద్యం ఆదాయం 39వేల కోట్ల మేరకు వస్తుండటం గమనార్హం.

ఆరు విడతల్లో చెల్లింపు

మద్యం దుకాణదారులు ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుంను సమంగా చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక లైసెన్సు రుసుంలో 25% మొత్తానికి 25 నెలలపాటు బ్యాంకు పూచీకత్తు ఇవ్వాలి. దుకాణం టర్నోవర్‌ వార్షిక లైసెన్సు రుసుంకు 10 రెట్లు దాటిన అనంతరం విక్రయాలపై 10% షాప్‌ టర్నోవర్‌ ట్యాక్స్‌ను వసూలు చేస్తారు. వ్యాపారులకు ఆర్డినరీ మద్యం విక్రయాలపై 27%, మీడియం, ప్రీమియం మద్యంపై 20%, బీర్లపై 20% మార్జిన్‌ను నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీకి అవతల 5 కి.మీ. పరిధిలోని దుకాణాలకూ జీహెచ్‌ఎంసీ లోపలి దుకాణాల లైసెన్సు రుసుమే వర్తిస్తుంది. ఇదే నియమం రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లకూ ఉంటుంది. అలాగే మున్సిపాలిటీ లేదా సెమీ అర్బన్‌ ఏరియాలకు అవతల 2 కి.మీ. పరిధిలోని వాటికి మున్సిపాలిటీల్లోని దుకాణాల మాదిరే రుసుం ఉంటుంది. స్పెషల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ గతంలో మాదిరిగానే ఏటా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. అమ్మకాలను బట్టి రూ.1.10 కోట్లు, రూ.85 లక్షలు, రూ.56 లక్షలు, రూ.55 లక్షలు, రూ50 లక్షల చొప్పన ఆరు స్లాబ్‌లను నిర్ణయించారు. అయితే లైసెన్స్‌దారులు చెల్లించాల్సిన లైసెన్స్‌ ఫీజులో ఆరో వంతును ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే వసూలు చేయడం గమనార్హం. లైసెన్స్‌దారులు ఎప్పటిలానే దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం ఒక గంట అదనంగా అంటే రాత్రి 11 గంటల వరకు అమ్మకాలు సాగించే వెసులుబాటు కల్పించింది.