Sada Bainama | 9 లక్షల సాదాబైనామాలకు త్వరలో పరిష్కారం : మండలిలో మంత్రి పొంగులేటి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సుమారు 9 లక్షల సాదాబైనామాలకు త్వరలో పరిష్కారం చూపుతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం శాసన మండలిలో ప్రకటించారు.

Ponguleti Srinivas Reddy

విధాత, హైదరాబాద్:
Sada Bainama | రాష్ట్రంలో 9 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటన్నింటికీ త్వరలో పరిష్కారం లభించబోతున్నదని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన ప్రకటించారు. శాసనమండలిలో మంగళవారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి సమాధానమిచ్చారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందని, కానీ 2020 ఆర్ఓఆర్ చట్టంలో పరిష్కారం మార్గం చూపించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ధరణి వెబ్ పోర్టల్ స్థానంలో భూ భారతి చట్టం తీసుకవచ్చామన్నారు. ఆర్ఓఆర్ చట్టంలో కొనుగోలుదారుడితో పాటు అమ్మకందారు నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనను పొందుపరచడం వల్ల గ్రామాల్లో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారుడి నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామని, ఈ మేరకు జీఓ 76 ను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

నక్షా లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాలల్లో ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించామని, ఇందులో ప్రతీ సర్వే నెంబర్ కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. త్వరలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 70 గ్రామాల చొప్పున భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించామన్నారు. దశల వారిగా భూ సర్వే నిర్వహించి ప్రతి ఒక్క యజమానికి భూధార్ ఇస్తామని, రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు.

ధరణి వెబ్ పోర్టల్ లోని లోసగులను ఆసరాగా చేసుకొని కొంత మంది మీ-సేవ నిర్వాహకులతో చేతులు కలిసి రూ.3.99 కోట్ల ప్రభుత్వ సొమ్మును కాజేశారని, దీనిపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించామని తెలిపారు. తప్పుచేసిన వారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేస్తామని ప్రకటించారు. ఈ అవినీతిలో రెవెన్యూ అధికారుల పాత్ర ఉంటే ఏ స్థాయిలో ఉన్నా కూడా ఉపేక్షించబోమని తెలిపారు. సభ్యులు తాతా మధుసుదన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి వెబ్ పోర్టల్ ను నాలుగు గోడల మధ్య ప్రజలతో సంబంధం లేకుండా అర్ధరాత్రి తీసుకొచ్చారని, దీని వల్లే కొత్తగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయని ఆయన విమర్శించారు. ధరణి వెబ్ పోర్టల్ లో 41 మాడ్యుల్స్ ఉంటే భూ భారతి పోర్టల్ లో వాటిని 6 కు కుదించామని, దీన్ని దశలవారీగా మార్పులు చేసుకుంటూ వస్తున్నామని, ఈ ఏప్రిల్ చివరి నాటికి పూర్తి స్థాయిలో సరిచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Latest News