22a List Controversy | తెలంగాణ రైతులకు సర్కార్ షాక్! కోటి ఎకరాల భూములపై లావాదేవీలు బంద్!
తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దాదాపు కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చుతూ, వాటిపై లావాదేవీలను నిలిపివేసింది. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విధాత, హైదరాబాద్ ప్రతినిధి:
22a List Controversy | తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. దాదాపు కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. వీటిపై లావాదేవీలను నిలిపివేసింది. ఈ విషయంలో గతంలోనే హైకోర్టు మొట్టి కాయలు వేసినా తెలంగాణ రెవెన్యూ శాఖ తీరు మారలేదని రైతులు మండిపడుతున్నారు. నిషేధిత భూముల జాబితా రూపకల్పనలో అనేక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 10,510 రెవెన్యూ గ్రామాలలో 22ఏ జాబితాను 96 శాతం ఐజీఆర్ఎస్ వెబ్ పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేశారు. సిరిసిల్ల, వరంగల్, గద్వాల జిల్లాల్లో కొన్ని గ్రామాల వివరాలు అందకపోవడంతో చేర్చలేకపోయారు. వంద శాతం అప్‌లోడ్ అయిన జిల్లాలు 16 ఉండగా, ఏడు జిల్లాల్లో 99 శాతం అప్‌లోడ్ అయ్యాయి. రెవెన్యూ వర్గాల ప్రకారం రాష్ట్రంలో ఒక కోటి ఎకరాలకు పైగా నిషేధిత భూముల జాబితాలో చేర్చారంటున్నారు. అంటే ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరుపకూడదు. తెలంగాణలో 2.53 కోట్ల ఎకరాల భూమి ఉండగా, ఇందులో 1.53 కోట్ల ఎకరాల వరకు పట్టా భూములు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు ఆదేశాల పేరుతో అడ్డగోలుగా 22ఏ జాబితాలో చేర్చారని, శాస్త్రీయ విధానం అవలంబించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నిషేధిత భూముల జాబితాను ఎప్పటికప్పుడు నవీకరించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను ఎప్పుడో మర్చిపోయిందంటున్నారు. ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ పని చేస్తే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ నిషేధిత భూముల జాబితా విషయంలో సమీక్షించుకుని, సరి చేయాలని, భవనాలు, బహుళ అంతస్తులు, విల్లాలు వచ్చిన ప్రాంతంలో ప్రజోపయోగ నిర్ణయం తీసుకోవాలని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల ఉసురు పోసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గోపనపల్లిలో 1800 ఎకరాలు జాబితాలోకి
రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,800 ఎకరాల భూమిని తెలంగాణ రెవెన్యూ శాఖ 22ఏ నిషేధిత జాబితాలో పెట్టింది. ఇక నుంచి ఈ భూములపై శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీలు నిర్వహించే అవకాశం ఉండదు. క్రయ విక్రయాలను నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తాజా నిర్ణయంతో కొనుగోలుదారులు ఉక్కిరిబిక్కిరికి గురవుతుండగా, నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లు పరిస్థితి ఏంటనే ఇంకా అర్థం కావడం లేదు.
ఐజీఆర్ఎస్ వెబ్ పోర్టల్‌లో 22ఏ భూముల జాబితా
రాష్ట్రంలో మొత్తం 10,953 రెవెన్యూ గ్రామాలు ఉండగా, 10,947 గ్రామాలలో నిషేధిత భూముల జాబితాను సిద్ధం చేసి 10,510 గ్రామాల జాబితాను ఐజీఆర్ఎస్ వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. వంద శాతం అప్‌లోడ్ అయిన జిల్లాలు 16 ఉండగా అందులో యాదాద్రి, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, మేడ్చల్, కుమ్రం భీమ్, కరీంనగర్, భూపాలపల్లి, జనగాం, హైదరాబాద్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, ఖమ్మం, పెద్దపల్లి ఉన్నాయి. అయితే ఈసారి హైకోర్టు ఆదేశం ప్రకారం రెవెన్యూ శాఖ 22ఏ భూములపై పూర్తి స్పష్టతనిచ్చింది. 1977 యాక్టు సెక్షన్ 4(1) కింద అసైన్డు భూములపై క్రయ విక్రయాలు జరిగితే రిజిస్ట్రేషన్ చేయకూడదు. 1959 భూ బదలాయింపు చట్టం ప్రకారం షెడ్యూల్డు ప్రాంతాల్లో భూములపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మునిసిపాలిటీల్లో అనుమతి లేని లే అవుట్లలో భూముల విక్రయాలపై ఆంక్షలు విధించారు. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నాలాలు వంటి వాటికి పది మీటర్ల పరిధిలో ఉన్న భూములపై కూడా నిషేధం అమలులో ఉంటుంది. ప్రజా అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం భూ సేకరణ చట్టం కింద సేకరించిన భూములకు 22ఏ వర్తించదు.
ఇదీ నేపథ్యం
భారత స్టాంపులు, రిజిస్ట్రేషన్ యాక్టు–1908లో 22ఏ సెక్షన్ ఉంది. ప్రభుత్వ భూములపై లావాదేవీలు జరగకుండా నిరోధించేందుకు 22ఏ సెక్షన్ అమలు చేస్తున్నారు. 22ఏ కింద నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత సబ్ రిజిస్ట్రార్లు లేదా మండల తహశీల్దార్లు రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఇలాంటి భూములపై ప్రభుత్వం డీ నోటిఫికేషన్ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. అయితే తెలంగాణలో రాజకీయ కక్ష సాధింపులకు 22ఏ ను ఆయుధంగా మలుచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారసత్వంగా లభించిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారని, మండల రెవెన్యూ అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించలేదని, వ్యక్తిగత కక్షతో ఇలా పలు కారణాలతో 22ఏ లో చేర్చారనే విమర్శలు ఉన్నాయి. నిషేధిత భూములపై వివిధ కోర్టులలో సుమారు 5వేలకు పైగా పిటీషన్లు దాఖలు అయ్యాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. ఒక్కసారి ఈ జాబితాలోకి భూములు వెళ్తే బయటకు రావడం చాలా కష్టం అని, భూమి యజమాని అష్టకష్టాలు పడాల్సి వస్తున్నదని కోర్టులకు బాధితులు విన్నవించుకున్నారు.
సవాలు చేస్తూ కోర్టులకు
భూముల రిజిస్ట్రేషన్ కు వెళ్లిన సందర్భంలో నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ సబ్ రిజిస్ట్రార్లు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వేలాది మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. 22ఏ పరిధిలోకి వచ్చే భూముల వివరాలను సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించాలని పది సంవత్సరాల క్రితం హైకోర్టు ఫుల్ బెంచి తీర్పు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ రెవెన్యూ శాఖను ప్రశ్నించింది. ప్రజలను ఎందుకు చీకటిలో పెడతారని గట్టిగా మందలించింది. ప్రజలందరూ చూడగలిగే విధంగా ఐజీఆర్ఎస్ వెబ్ పోర్టల్‌లో పెట్టాలని గడువు విధించింది. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు రెవెన్యూ శాఖ డిసెంబర్ 3వ తేదీన 22ఏ నిషేధిత భూముల జాబితాను ఐజీఆర్ఎస్ వెబ్ పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేసింది.
గోపన్‌పల్లిలో 1,800 ఎకరాలు 22ఏ లోకి
గోపన్‌పల్లి రెవెన్యూ గ్రామంలో మొత్తం 2,453.38 ఎకరాలు ఉండగా అందులో 75 శాతం భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ వివరాలను ఐజీఆర్ఎస్ వెబ్ పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేయడంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. అప్‌లోడ్ డాటా ప్రకారం గోపన్‌పల్లి సర్వే నెంబర్లు 5, 7, 14, 20, 21, 32, 33, 34, 35, 36, 37, 49, 66, 74, 124, 178, 311, 316 నిషేధిత జాబితాలోకి చేర్చారు. సబ్ డివిజన్ నెంబర్లు కూడా చేర్చడం చర్చనీయాంశంగా మారింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో విల్లాలు, కాలనీలు, బహుళ అంతస్తలు భవనాలు ఉన్నాయి. హెచ్ఎండీఏ పెద్ద ఎత్తున అనుమతులు మంజూరు చేయడంతో నిర్మాణాలు పూర్తి చేసి విక్రయించారు. భాగ్యనగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ, విప్రో, టీసీఎస్ క్యాంపస్, టీఐఎఫ్ఆర్ వంటి ప్రముఖ సంస్థలకు ప్రభుత్వమే భూములు కేటాయించింది. ఇవే కాకుండా తాజ్ నగర్, సోఫా కాలనీ, ఎన్టీఆర్ నగర్, గోపన్ పల్లి తండా లను కూడా చేర్చడం గమనార్హం. బహిరంగ మార్కెట్ లో ఈ భూముల విలువ రూ.20వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
వికారాబాద్ రైతు బాధ ఇదీ
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామంలో శేఖరయ్య అనే రైతు ఉన్నారు. తన కుమార్తెకు కొంత భూమిని అప్పగించేందుకు మీ సేవ కేంద్రంలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకునేందుకు ఈ ఏడాది ఆగస్టు నెలలో వెళ్లారు. నిషేధిత జాబితాలో భూమి ఉందని చూపడంతో శేఖరయ్య కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. పట్టాదార్ పాసు పుస్తకంలో 2.33 ఎకరాలు ఉండగా అందులో ఒక సర్వే నెంబర్ లో 1.07 ఎకరాలు పట్టా భూమి, మరో సర్వే నెంబర్ 1.26 ఎకరాలు లవాణి భూమి ఉంది. వాస్తవానికి 1.26 ఎకరాల భూమి చేర్చాల్సి ఉండగా 2.33 ఎకరాలు చేర్చి రైతుకు నిద్ర లేకుండా చేశారు. భారత స్టాంపులు, రిజిస్ట్రేషన్ చట్టం -1908 ప్రకారం ఎప్పటికప్పుడు నిషేధిత భూముల వివరాలను నవీకరించాలి. కాని ఆ పని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత నిర్వహించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి సారిగా నవీకరించినప్పుడు తెలంగాణలో ఒక కోటి 90 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి.
పెద్ద ఎత్తున బేరసారాలు
22ఏ జాబితా విషయంలో ప్రభుత్వం వివరాలు తెప్పించుకుంటున్నదని తెలుసుకున్న కొందరు అధికారులు, అక్రమార్కులు దందాకు తెరలేపారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి రెవెన్యూ అధికారులను బుట్టలో వేసుకున్నారు. తమ భూములను రక్షించుకునేందుకు పై స్థాయిలో పైరవీలు చేయించుకుని, ఆమ్యామ్యాలు ముట్టచెప్పి జాబితాలో చేర్చకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలో గండిపేట, చేవెళ్ల, మొయినాబాద్, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాల్లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను తప్పించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ముట్టచెప్పుకోలేని మధ్య తరగతి ప్రజలు, రైతులు బలైపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Rangareddy : ల్యాండ్ రికార్డు ఏడీ అక్రమాస్తులు రూ.100కోట్లపైనే!
Medaram Jathara | మేడారం ఆదివాసీ గిరిజన మహాజాతర.. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు
HILT Policy Controversy | రెండేళ్లుగా రేవంత్ సర్కార్‌లో లీకు వీరుల హవా.. హిల్ట్ పాలసీ లీక్ తో దుమారం!
Two Years Congress Ruling | 23 నెలల కాంగ్రెస్ పాలన.. 2.5 లక్షల కోట్లు అప్పులు! బకాయిదారులకు మొండి చెయ్యే!!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram