మెగా రైతు మేళా వర్సెస్ రైతు సంగ్రామ సదస్సు… ఒకే రోజు కాంగ్రెస్, బీఆరెస్‌ పోటాపోటీ కార్యక్రమాలు

ఒకే రోజు అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలు మరోసారి రానున్నాయి. ఈ నెల ఆరో తేదీన రైతు సంగ్రామ సదస్సు పేరిట సమావేశం నిర్వహించేందుకు బీఆరెస్‌ నేతలు ఏర్పాట్టు చేస్తుండగా.. అదే రోజు నుంచి మూడు రోజులపాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు మేళా నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

  • By: TAAZ |    telangana |    Published on : May 03, 2026 7:53 PM IST
మెగా రైతు మేళా వర్సెస్ రైతు సంగ్రామ సదస్సు… ఒకే రోజు కాంగ్రెస్, బీఆరెస్‌ పోటాపోటీ కార్యక్రమాలు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

రైతుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా మూడు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం మెగా రైతు మేళాకు సిద్ధమవుతుండగా, రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిదంటూ బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహణకు సిద్ధమైంది. రెండు కార్యక్రమాలు ఒకే రోజు నిర్వహించనుండటం రాజకీయ చర్చలకు తావిచ్చింది. ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ద్వారా ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా, బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా రైతులను సమీకరిస్తామంటూ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వానికి పరోక్షంగా అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా నేతల మధ్య పోటీ నెలకొనడమే కాకుండా సవాలుగా మారింది. ప్రభుత్వ రైతు మేళా మూడు రోజుల పాటు నిర్వహించేందుకు నిర్ణయించగా, బీఆర్ఎస్ ఒక రోజు సదస్సు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇరువర్గాలు భారీగా రైతులను సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి.

సర్కారు రైతుమేళా

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల పాటు చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా రైతు వారోత్సవాలు నిర్వహించేందుకు గతంలో నిర్ణయించారు. ఈ మేరకు అన్ని జిల్లాలో ఈ వారోత్సవాల్లో భాగంగా రైతులకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు చేపట్టే విధంగా నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ నెల 5,6,7 తేదీల్లో మూడు రోజుల పాటు మెగా రైతు మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండులో ఈ మేళాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యే విధంగా ఆయా జిల్లాల యంత్రాంగం, జిల్లాల వ్యవసాయ శాఖలు నిమగ్నమయ్యాయి. మేళాకు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఉపయోగపడే విధంగా ఈ మేళాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ మేళాలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల నిర్వహణలో ఉత్తమ విధానాలు పరిచయం చేసే విధంగా స్టాళ్లను సమగ్రంగా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, రవాణా, భద్రత తదితర అన్ని సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు తరలిరానున్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ పనుల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది.

బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు

రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ ఆ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన మే 6వ తేదీన బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ కార్యక్రమం రైతు వారోత్సవాల్లో భాగంగా 5,6,7 తేదీల్లో మెగా రైతు మేళా నిర్వహిస్తుండగా, బీఆర్ఎస్ 6వ తేదీన సదస్సు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సదస్సుకు 10వేల మంది రైతులను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సమీకరిస్తామంటూ ప్రకటించారు. ప్రభుత్వ కార్యక్రమం ముందుగానే నిర్ణయించినప్పటికీ తాము సంగ్రామ సదస్సు ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పోటీగా మేళా పేరుతో రైతుల సమావేశం పెడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తమ కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తుందంటూ విమర్శించారు. హంటర్ రోడ్డులోని ఓ ప్రైవేటు స్థలంలో ఈ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండించిన పంటలు కొనుగోలు చేయడం లేదంటూ విమర్శిస్తున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని పచ్చని తెలంగాణ గా మార్చితే కాంగ్రెస్ రెండున్నర ఏళ్ల పాలన లో విధ్వంసం జరిగిందంటూ మండిపడుతున్నారు. రైతు సదస్సు ద్వారా భరోసా ఇస్తామంటూ ప్రకటించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు రైతుసదస్సు బీఆర్ఎస్ పెడితే పోటీగా కాంగ్రెస్ సభపెడతా అంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ హరి రమాదేవి తదితరులు సదస్సు పోస్టర్ ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి..

మత్తు బాబులకు తెలంగాణలో షాక్.. ఫుల్‌బాటిల్‌పై కనీస బాదుడు రూ.60?
ముందుగానే రుతుపవనాల రాక..ఈ నెలలోనే అండమాన్ కు!
Destination Wedding | ఇదేం పోయేకాలం.. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో శ్మశానంలో పెళ్లి చేసుకున్న జంట!