తెలంగాణ సర్వ నాశనానికే కవిత పార్టీ

తెలంగాణలో కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన(TRS) పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను నాశనం చేసేందుకే కవిత కొత్త పార్టీ పెట్టారంటూ ఆరోపించారు.

తెలంగాణ సర్వ నాశనానికే కవిత పార్టీ

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన(TRS) పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను నాశనం చేసేందుకే కవిత కొత్త పార్టీ పెట్టారంటూ ఆరోపించారు. నేను ఇరాన్ తో అమెరికా యుద్దంను ఆపేందుకు, ప్రపంచంలోని 850కోట్ల ప్రజలను కాపాడేందుకు అమెరికాలో ఉండి అధ్యక్షుడు ట్రంప్ , స్పీకర్ సహా ఆ దేశ నాయకులతో చర్చలు సాగిస్తూ బిజీగా ఉన్నానన్నారు. ఇదే సమయంలో కవిత కొత్త పార్టీ పెట్టారన్నారు.

కేవలం తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌తో ఉన్న విభేదాల వల్లే కవిత పార్టీ పెట్టారని పాల్ విమర్శించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, వైఎస్ షర్మిల పార్టీలు నిలబడలేకపోయాయని, కవిత మనుగడ కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిలకడలేని వాళ్లను నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవొద్దని పాల్ అన్నారు. బీసీలను, దళిత, మైనార్టీలను కవిత సీఎం చేస్తానని చెప్పడం లేదని, తను సీఎం అవుతానంటూ చెప్పుకుంటుందన్నారు.

కేసీఆర్ కుటుంబం సంపాదించిన లక్షల కోట్ల అక్రమాస్తులలో పంపకాల తేడాల వివాదంతో అన్న, తండ్రితో విభేదించి కవిత పార్టీ పెట్టారని విమర్శించారు.  తన వద్ద  ఉన్న దోచుకున్న వేల కోట్లతో రాజకీయ పార్టీ పెట్టి సీఎం అవుతానంటు కవిత కలలు కంటున్నారన్నారు. కవిత మాటలకు మోసపోవద్దని, అందుకే 1000మంది మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలలో ఒక్కరు కూడా ఆమె పార్టీలో చేరలేదన్నారు. కుటుంబ, కుల, అవినీతి పార్టీలను ప్రజలు దూరంగా పెట్టాలని, అందరిని అభివృద్ది చేసే ప్రజాశాంతి పార్టీలో చేరాలని పాల్ కోరారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలను మోసం చేసేందుకే కవితతో పార్టీ పెట్టించారని పాల్ ఆరోపించారు. మోసపూరిత హామీలతో కవిత ప్రజలను మభ్యపెడుతుందన్నారు.  తెలుగు రాష్ట్రాల అభివృద్ది నా ఒక్కడితోనే సాధ్యం అని పాల్ చెప్పుకొచ్చారు.