Telangana Private Colleges Bandh | 3 నుంచి విద్యాసంస్థల నిరవధిక బంద్ : ప్రైవేటు విద్యాసంస్థల సమాఖ్య
ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌ల రూ. 900 కోట్ల బకాయిలను నవంబర్ 1 నాటికి విడుదల చేయకపోతే, నవంబర్ 3 నుంచి తెలంగాణవ్యాప్తంగా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలను నిరవధికంగా బంద్ చేస్తామని ప్రైవేటు విద్యా సంస్థల సమాఖ్య హెచ్చరించింది. ప్రభుత్వం మొత్తం రూ. 10 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
విధాత : ఓ వైపు వరి ధాన్యం బోనస్ డబ్బుల కోసం రైతులు..వేతనాల కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచ్ లు ఆందోళనలకు దిగుతున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల పంచాయతీ మరింత సమస్యాత్మకంగా తయారైంది.
నవంబర్ 1వ తేదీ నాటికి ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 900 కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా 3వ తేదీ నుంచి ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యలు హెచ్చరిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం రెండేండ్లలో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయలేదు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకోట్ల మేరకు ఆయా బకాయిలు ఇవ్వాల్సి ఉంది. టోకెన్లు జారీ అయిన రూ.1,207 కోట్లను దీపావళి పండుగ లోపు విడుదల చేస్తామని సర్కారు హామీనిచ్చింది. దానిలో భాగంగా కేవలం రూ.300 కోట్లును మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది.
దీంతో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల సమస్యతో వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడంలేదు. మరోవైపు కాలేజీలను నడపలేకపోతున్నామని యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కళాశాలల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చామని చెప్తున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్. బీఈడీ, బీఎడ్, ఎంబిఏ, ఎంసీఏ, నర్సింగ్, పీజీ, డిగ్రీ కాలేజీలను నవంబర్ 3నుంచి మూసివేయనున్నట్లు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది. అలాగే 30న విద్యార్థి సంఘాలు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల డిమాండ్ తో విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నాయి.
ప్రభుత్వ బెదిరింపులకు భయపడం : ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు
నవంబర్ 1 నాటికి రూ.900కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశిస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ అసోషియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్సిట్యూషన్ చైర్మన్ రమేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే నవంబర్ 3 నుంచి ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంద్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బకాయిలు అడిగితేనే ప్రభుత్వానికి విజిలెన్స్ తనిఖీలు గుర్తుకు వస్తున్నాయని..అలాంటి బెదిరింపులకు భయపడి ఈసారి వెనక్కి తగ్గేది లేదు అన్నారు. అన్ని వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ ,పీజీ కాలేజీలు నిరవదిక బంద్ చేస్తాం..హామీ ఇచ్చి మళ్ళీ నెరవేర్చక పోతే మార్చి , ఏప్రిల్ లో జరిగే ఫైనల్ పరీక్షలు కూడా బాయ్ కాట్ చేస్తాం అని తెలిపారు.
2024-25 విద్యా సంవత్సరం వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక కాలపరిమితి గల రోడ్‌మ్యాప్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2026 జూన్ నాటికి పూర్తి చెల్లింపు జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత సంవత్సరం 2025-26 బకాయిలు సకాలంలో విడుదల చేయాలని..ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే బంద్ లో రోజుకో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లో అధ్యాపకులతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, 10 లక్షల మంది విద్యార్థులను హైదరాబాద్ తీసుకొచ్చి నిరసన నిర్వహిస్తామని పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram