TG Private Colleges Strike Over Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం మళ్లీ కళాశాలల బంద్!
ఫీజు రీయంబర్స్ బకాయిల విడుదల ఆలస్యం ప్రైవేట్ కళాశాలలు మళ్లీ సమ్మెకు సిద్దమయ్యాయి

విధాత, హైదరాబాద్ : ఫీజురీయంబర్స్ మెంట్ బకాయిల విడుదలపై ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడంతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య మరోసారి కళాశాలల బంద్ కు సిద్దమైంది. రూ.8వేల కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల విడుదల డిమాండ్ తో ఇటీవల నిర్వహించిన కళాశాలల బంద్ సందర్భంగా ప్రభుత్వం రూ.1200కోట్లు చెల్లిస్తామని..ముందుగా దసరాకు రూ.600కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం వద్ధ నిధులు లేవంటూ..కేవలం రూ.200కోట్ల మాత్రమే విడుదల చేసింది. ఈ చర్యతో ఆగ్రహానికి గురైన ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య మరోసారి సమ్మెకు సిద్దమైంది.
ఈనెల 12వ తేదీలోగా బకాయిలు విడుదల చేయకుంటే.. 13 నుంచి సమ్మె చేపడుతామని ప్రకటించింది. రూ.1200 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రూ.200కోట్లు మాత్రమే చెల్లించిందని..మిగతా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు రూ.1000కోట్లు ఈ నెల 12 లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే మిగిలిన బకాయిల చెల్లింపు పై క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అవసరమైతే విద్యార్థులతో కలిసి చలో హైదరాబాద్ చేపడతాం అని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య కీలక ప్రకటన జారీ చేసింది.