Economic Survey | తెలంగాణలో రోడ్ల విప్లవం.. 19,450 కి.మీ. రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ : ఆర్థిక సర్వేలో వెల్లడి

తెలంగాణలో భారీ రోడ్ల విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,450 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో 12,000 కి.మీ. రాష్ట్ర రోడ్లు, 7,450 కి.మీ. గ్రామీణ రోడ్లు ఉండటం విశేషం. హైబ్రిడ్ ఆన్యుటీ మోడల్ ద్వారా ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయని తెలంగాణ సోషియో ఎకనామిక్‌ సర్వే 2026లో పేర్కొన్నారు..

విధాత, హైదరాబాద్:
Economic Survey | తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే-2026 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం, నీటి పారుదల, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, ఐటీ ఎగుమతులు, పారిశ్రామిక రంగం, రోడ్లు, రవాణా, టెలి కమ్యూనికేషన్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య రంగాలు, పట్టణ జనాభా, తలసరి ఆదాయంలో పురోగతి వంటి అంశాల వారీగా వివరాల ఇలా ఉన్నాయి. ప్రత్యేకించి 19,450 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.

వ్యవసాయం

తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు లేకపోయినప్పటికీ ఆహార ధాన్యాల దిగుబడి పెరుగుతూనే ఉంది. 2023–24 లో 207.95 మెట్రిక్ టన్నులు కాగా 2024-25లో 232.10 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2025–26లో 236.87 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

వానాకాలం 2025 (జూన్ 16 నుంచి 24వ తేదీ వరకు) 69.40 లక్షల మంది రైతులకు రూ.8,744.13 కోట్లు రైతు భరోసా కింద విడుదల చేశారు. 2025-26 వానాకాలం సీజన్ లో 71.86 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగుల చేసి 14.35 లక్షల రైతులకు రూ.19,099 కోట్లు చెల్లింపులు చేశారు. ఇందులో క్వింటాల్ కు రూ.500 చొప్పున రూ.1,940 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేశారు.

వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2025-26 వార్షిక బడ్జెట్ లో ప్రభఉత్వం రూ.26,684 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయింపులతో పోల్చితే ఇది 10.1 శాతం అధికం. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి 2024–25 లో 2,10,179 కోట్లు కాగా 2025-26 లో 2,13,799 కోట్లకు (1.7 శాతం) పెరిగింది.

2008-09 సంవత్సరం నుంచి 2024 వరకు రాష్ట్రంలో భూ వినియోగాన్ని పరిశీలిస్తే సాగుభూమి క్రమంగా పెరుగుతోంది. పడావు భూముల విస్తీర్ణం తగ్గుతుండటం శుభపరిణామంగా చెప్పుకోవాలి. 2008–09 సంవత్సరంలో సాగుభూమి 43.33 లక్షల హెక్టార్లు కాగా అది 2025 నాటికి 56.18 లక్షల హెక్టార్లకు పెరిగింది.

నీటి పారుదల, వనరులు

కరువు బాధిత ప్రాంతాలకు వీలైనంతగా నీటి పారుదల సౌకర్యం కల్పించి వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు పెంచాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఖర్చు పెడుతున్నది. భారీ, మధ్య, చిన్న తరహ నీటి పారుదల, ఎత్తిపోతల పథకాల ద్వారా 127.69 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నది. ఇప్పటి వరకు 74.51 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యం కల్పించింది. 73 భారీ, మధ్య తరహా నీటి ప్రాజెక్టులలో ఇప్పటికే 42 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇందులో సదర్ మఠ్ బ్యారేజీని ఇటీవలే ప్రారంభించుకున్నారు. మక్తల్-నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా ఒక లక్ష ఎకరాలను నీరందించనున్నారు. విస్తారంగా వర్షాలు కురవడం తో 2025 లో భూగర్భ జలాలు 7 శాతం మేర పైకి పెరగ్గా, 9 శాతం మేర వివిధ అవసరాల కోసం వినియోగించుకున్నారు.

రోడ్లు, రవాణా

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఫిబ్రవరి 2026 వరకు రూ.15,564 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల నిర్మాణం కోసం ఖర్చు చేశారు. ఉత్తర భాగంలో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిఫుల్ ఆర్) నిర్మాణం కోసం భూ సేకరణ జరుగుతుండగా, దక్షిణ భాగం ను హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ లో చేర్చారు. హైబ్రీడ్ ఆన్యుటీ మోడ్ (హ్యామ్) విధానంలో రాష్ట్ర రోడ్లు 12వేల కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంత రోడ్లు 7,450 కిలోమీటర్లను నిర్మాణం చేయనున్నారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు 269.68 కోట్ల ట్రిప్పులను తిప్పి మహిళలకు రూ.9,222 కోట్లు ఆదా చేశారు. అదనంగా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా గ్రూపులతో 600 బస్సులను కొనుగోలు చేయించి టీజీఎస్ఆర్టీసీ కి లీజుకు ఇప్పించారు. ఓఆర్ఆర్ పరిధిలో 2,800 బస్సులను ఈవీగా మార్చేందుకు వంద శాతం పన్ను మినహాయింపు కల్పించారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రో రైలు వ్యవస్థ ను స్వాధీనం చేసుకున్న తరువాత ఫేజ్ టూ ను విస్తరించేందుకు రూ.43,848 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. 2024-25 లో విమాన ప్రయాణీకులు 2.9 కోట్లకు పెరగా, గత సంవత్సరంతో పోల్చితే ఇది 16.49 శాతం పెరుగుదల. రాష్ట్రంలో మరో ఆరు విమానాశ్రయాలను విస్తరించాలని లక్ష్యంగా నిర్ణయించుకుని వరంగల్ లో ఏయిర్ పోర్టు విస్తరణ కోసం 253 ఎకరాలను ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కు అప్పగించారు.

పరిశ్రమలు, ఉపాధి, ఎగుమతులు

రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో పెరుగుదలను పరిశీలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో పోల్చితే 8.1 శాతం పెరుగుదల కన్పిస్తున్నది. 2025–26లో పారిశ్రామిక రంగం నుంచి రూ.3,04,217 కోట్లు రాగా అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 8.1 శాతం పెరిగడం విశేషం. రాష్ట్రం మొత్తం ఆదాయంలో ఈ రంగం నుంచి 18.5 శాతం వాటా ఉన్నది. ప్రాథమిక ఉత్పత్తి రంగంలో 7.7 శాతం పెరుగుదల ఉండగా, నిర్మాణ రంగంలో 11.4 శాతం పెరుగుదల ఉంది. కార్మిక సర్వే ప్రకారం అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 నాటికి 15 సంవత్సరాల వయస్సు ఉన్నవారు పారిశ్రామిక వాడలలో 22.2 శాతం మంది పని చేస్తున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు 17.7 శాతం కాగా పట్టణ ప్రాంతాల నుంచి 30.2 శాతం మంది చొప్పున ఉన్నారు. వీరిలో మగవారు 21.9 శాతం కాగా ఆడవారు 22.8 శాతం మంది ఉన్నారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్రంలో సింగిల్ విండో విధానంలో డిసెంబర్ 31, 2025 నాటికి 1,457 ఉత్పత్తి పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయగా రూ.7,338.42 కోట్లు పెట్టుబడి వచ్చింది. ఈ పరిశ్రమాల ద్వారా 36,919 మందికి ఉపాధి లభించింది. డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు టీజీఐఐసీ 998 యూనిట్లకు 2,195 ఎకరాల భూమిని కేటాయించగా రూ.88,534 కోట్ల పెట్టుబడులు రాగా 75,008 మందికి ఉపాధి కల్పన జరిగింది. ఇందులో గ్రీన్ ఫార్మా సిటీ, మెడికల్ డివైసెస్ పార్క్, టెక్స్ టైల్, ఎలక్ట్రానిక్స్ రంగాలు ఉన్నాయి. నెక్ట్స్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ కింద 2026-30 సంవత్సరాలలో 25 యూఎస్ బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఆర్థిక పురోగతికి లైఫ్ సైన్సెస్ దిక్సూచిగా ఉందని, ఈ రంగంలో రూ.73,360 కోట్లు పెట్టుబడుల ద్వారా నేరుగా ఒక లక్ష మందికి, పరోక్షంగా మరో రెండున్నర లక్షల మంది ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు 14 స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసి 7,150 ఎకరాల భూమిని కేటాయించారు. 2025 డిసెంబర్ 30వ తేదీ నాటికి రూ.1,928.3 కోట్ల పెట్టుబడులు రాగా 10,335 మందికి ఉద్యోగాలు లభించాయి.

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు చేస్తున్న అత్యధిక రాష్ట్రాలలో తెలంగాణ ఏడవ స్థానం సంపాదించుకోగా, రూ.1,61,843 కోట్ల ఎగుమతులు చేసి, గత సంవత్సరంతో పోల్చితే 39.30 శాతం పెరిగింది. ఇక్కడి నుంచి ఏయిర్ క్రాఫ్ట్, స్పెస్ క్రాఫ్ట్ కు సంబంధించిన ఉత్పత్తులతో పాటు ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేశారు. ఎక్కువగా యూఎస్ఏ కు ఎగుమతులు చేయడం ద్వారా నాణ్యతలో ముందున్నామని నిరూపించుకున్నారు. ఎగుమతులు చేసిన ఉత్పత్తుల్లో 90 శాతం మేర రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచే ఉన్నాయి.

సేవా రంగం, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ

తెలంగాణ ఆర్థిక పరిపుష్టిలో సేవా రంగం అగ్రగామిగా ఉన్నది. 2025-26 లో సేవల రంగం వాటా 68.6 శాతం ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఏఐ స్టార్టప్ లలో తెలంగాణ వాటా 7 శాతం కాగా కర్నాటకలో 39 శాతం, మహారాష్ట్రలో 14 శాతం, ఢిల్లీలో 9 శాతం గా ఉంది. సేవా రంగం నుంచి 2024-25 లో రూ.9,99,293 కోట్లు ఎగుమతులు జరగ్గా, 2025-26 లో 11,30,596 కోట్లు నమోదు అయ్యాయి. గత సంవత్సరంతో పోల్చితే 13.5 శాతం పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగం నుంచి రూ.3,86,043 కోట్లు, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్లు, ట్రేడ్ రంగాల నుంచి రూ3,43,249 కోట్లు ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునందించాయి. మొత్తం 1,500 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు 2024-25 లో ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లు కాగా అంతకు ముందు సంవత్సరం 2023-2 తో పోల్చితే 16.6 శాతం పెరిగింది. 2024-25 లో 9.39 లక్షల మందికి ఉపాధి లభించింది. దేశంలోని గ్లోబల్ కేపబిలిటి సెంటర్స్ (జీసీసీ) ల ఏర్పాటులో 20 శాతం వాటా కలిగి ఉండగా, 2025 అక్టోబర్ నాటికి 40 నూతన జీసీసీలను ఏర్పాటు చేసింది.

టెలి కమ్యూనికేషన్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలు

2025 సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో 42.16 మిలియన్ల టెలిఫోన్ వినియోగదారులు ఉండగా (ఇందులో మొబైల్ వినియోగదారులు 96.56 శాతం) ఇంటర్ నెట్ వినియోగదారులు 37.25 మిలియన్లు (బ్రాడ్ బ్యాండ్ 98.71 శాతం) ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే టెలిఫోన్ వినియోగదారులు తెలంగాణలో అత్యధికంగా ఉన్నారు. రాష్ట్రంలోని 8,895 గ్రామ పంచాయతీలకు టీ ఫైబర్ కనెక్షన్లు ఇవ్వగా, పెద్దపల్లి జిల్లాలో దేశంలోనే తొలి రూరల్ ఏఐ ల్యాబ్ ను ప్రారంభించారు.

విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు

విద్యతో పాటు క్రీడలు, సైన్స్ అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్సోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలు, వరంగల్ హెల్త్ సీటీ, తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టీమ్స్), హైదరాబాద్ నిమ్స్ విస్తరణ, ఉస్మానియా ఆసుపత్రి భవనాల నిర్మాణం కోసం రూ.10,937 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వరంగల్ హెల్త్ సిటీలో 2వేల పడకలు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో మరో 2వేల పడకలు, నిమ్స్ లో అదనపు పడకల కోసం రూ.1,600 కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రైమరీ హెల్త్ సెంటర్లు, పట్టణాల్లో పడకల సంఖ్య రెండింతలు (మొత్తం 12,760 పడకలు) పెరిగాయి. రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్సలు, వైద్యం అందించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో ప్రారంభించారు. రాష్ట్రంలోని 23.51 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయి హెల్త్ స్కీమ్ ను అమలు చేస్తూ 1,998 రకాల వైద్య చికిత్సలు అందచేస్తున్నారు. వైద్య, ఆరోగ్య సేవలను పెంపొందించేందుకు ప్రతి జిల్లాలో జనరల్ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,140 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 35 మెడికల్ కాలేజీల్లో బోధన జరుగుతోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రేమావతి పేటలో తెలంగాణ హైకోర్టు భవన సముదాయం, జడ్జీల రెసిడెన్సీ నిర్మాణం కోసం రూ.2,583 కోట్లు, 12 జిల్లాల్లో కొత్త జిల్లా కోర్టుల కాంప్లెక్సుల కోసం రూ.972 కోట్లు కేటాయించారు.

పట్టణ జనాభాలో అగ్రస్థానం

తెలంగాణలో పట్టణ జనాభా 2026 నాటికి మొత్తం జనాభాలో 50.08 శాతానికి చేరుకున్నది. దేశంలో పట్టణ జనాభా 2026 లో 36.01 శాతం కాగా 2036 నాటికి 39.06 శాతానికి చేరుకుంటుందని అంచనా. హైదరాబాద్ ను అన్ని రంగాల్లో డెవలప్ చేసేందుకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ మోడల్ ను ప్రతిపాదించి 2,053 చదరపు కిలోమీటర్ల పరిధిలో నెట్ జీరో సర్వీసులను అందించనున్నారు. అందరికీ ఆర్థిక సమానవకాశాలను కల్పించేందుకు రీజినల్ అర్బన్ క్లస్టర్లను సమీప పట్టణాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హెచ్ సిటీ ఎస్ఆర్డీపీ కింద హైదరాబాద్ లో 10 రోడ్లు విస్తరించనున్నారు. ఇరుకు రోడ్ల సమస్యను పరిష్కరించేందుకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రూ.7,406 కోట్లు హెచ్ఎండీఏ ఖర్చు చేయనున్నది. రెండు ప్రధాన రోడ్ల మధ్య ఉన్న 35 లింకు రోడ్లు నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేయగా మరో 7.22 కిలోమీటర్లు పూర్తి చేసేందుకు రూ.91 కోట్లు కేటాయించారు. మరో 49 కొత్త లింక్ రోడ్ల నిర్మాణం కోసం రూ.1,500 కోట్లు మంజూరు చేశారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య కనెక్టివిటీ కోసం 41 కిలోమీటర్ల పొడువునా ఆరు లేన్ల ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం, 81 కిలోమీటర్ల పొడవునా రీజినల్ కారిడార్ నిర్మాణం చేయనున్నారు.

తెలంగాణ తలసరి ఆదాయం

తెలంగాణలో తలసరి ఆదాయం 2025-26 లో రూ.4,18,931 కాగా జాతీయ స్థాయిలో సగటున తలసరి ఆదాయం రూ.2,19,575. ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడం మూలంగా తెలంగాణలో తలసరి ఆదాయం గణనీయంగా ఉండడమే కాకుండా 10.2 శాతం నమోదు అయ్యింది. తెలంగాణ జీఎస్డీపీ 2025-26 రూ.17.82 లక్షల కోట్లు కాగా జాతీయ స్థాయిలో పెరుగుదల 8 శాతం ఉండగా తెలంగాణలో 10.7 శాతం ఉంది. దేశ జీడీపీలో తెలంగాణ 2023-24 లో 4.87 శాతం కాగా 2025-26 నాటికి 4.99 శాతానికి పెరిగింది. జిల్లా స్థాయిలో పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా లో 2024-25 లో జిల్లా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం లో (రూ.11,29,735) మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో హైదరాబాద్ జిల్లా నిలిచింది. హనుమకొండ జిల్లా మాత్రం చివరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Latest News