BRS MLAs defection | బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో విచారణ ముగించిన స్పీకర్‌

బిఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ గద్దం ప్రసాద్‌కుమార్‌ విచారణ పూర్తి చేశారు. వీడియో సాక్ష్యాలు, అఫిడవిట్లు సమర్పించిన బిఆర్ఎస్‌. అక్టోబర్‌ 30నాటికి తుదితీర్పు ఇవ్వాల్సి ఉంది.

BRS MLAs defection | బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో విచారణ ముగించిన స్పీకర్‌

Speaker Wraps Up Crucial Cross-Examinations in BRS–Congress Defection Row

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (విధాత‌):
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్‌ గద్దం ప్రసాద్‌కుమార్‌ కీలకమైన దశను పూర్తి చేశారు. శనివారం ఆయన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలపై క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను ముగించారు.

ఈ విచారణలు స్పీకర్‌ చాంబర్‌లో ఇన్‌ కెమెరా (గోప్యంగా) జరిగాయి. సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, స్పీకర్‌ ఇలాంటి కేసుల్లో క్వాసి జ్యుడీషియల్‌ అధికారిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన మూడు నెలల్లో తీర్పు ఇవ్వాల్సి ఉండటంతో, అక్టోబర్‌ 30నాటికి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి.

పార్టీ ఫిరాయింపు విచారణలో ఏం జరిగింది?

ఈరోజు జరిగిన విచారణలో బిఆర్ఎస్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు పలు వీడియో సాక్ష్యాలు, అఫిడవిట్లు, మరియు పార్టీ నాయకుల ప్రకటనలను సమర్పించారు. వీటిలో ప్రధానంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన చేరిక కార్యక్రమం వీడియో, మీడియా ముందు ఇచ్చిన ప్రకటనలు, ఇంకా ఫొటోలు ఉన్నాయి. అయితే, ఇద్దరు ఎమ్మెల్యేలూ తాము కాంగ్రెస్‌లో చేరలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించడానికే వెళ్ళామని వాదించారు. “మేము బిఆర్ఎస్‌ సభ్యులమే. పార్టీలోనే ఉన్నాం. రేవంత్‌రెడ్డితో జరిగిన భేటీ పూర్తిగా అభివృద్ధి అంశాలపై మాత్రమే జరిగింది” అని వారు తమ సాక్ష్యాలలో తెలిపారు.

 బిఆర్ఎస్‌ ప్రతివాదం – ‘స్వచ్ఛందంగా విడిచారు’

బిఆర్ఎస్‌ తరఫు న్యాయవాదులు మాత్రం ఈ వాదనలను తిరస్కరించారు. “తమ సొంత పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించి, ప్రతిపక్ష నేతలతో వేదిక పంచుకోవడం చట్టపరంగా స్వచ్ఛంద రాజీనామాగా పరిగణించబడుతుంది,” అని వారు వాదించారు.
ఒక సీనియర్‌ బిఆర్ఎస్‌ నేత వ్యాఖ్యానిస్తూ, “వీరు స్వచ్ఛందంగా పార్టీని వదిలిపెట్టారు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. న్యాయం జరిగి తీరుతుంది” అన్నారు.

అసలు నేపథ్యం

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్‌ 39 సీట్లు, కాంగ్రెస్‌ 64 సీట్లు గెలిచింది. అయితే ఎన్నికల అయిపోయి, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత, బిఆర్ఎస్‌ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటి వరకు 10 మంది బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారారని, వారిపై బిఆర్​ఎప్​ అనర్హత పిటిషన్లు వేసింది. వీరిలో గూడెం మహిపాల్‌రెడ్డి జూలై 15న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లారెడ్డిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై బిఆర్ఎస్‌ సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇది ఎన్నికల్లో ఇచ్చిన ప్రజా తీర్పును అవమానపరచడమే” అని పేర్కొన్నారు.

పిటిషనర్‌ వాదనలు – మరిన్ని సాక్ష్యాలు సిద్ధం

కేసులో ప్రధాన పిటిషనర్‌గా ఉన్న బిఆర్ఎస్‌ నేత సోమ భారత్‌కుమార్‌, విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ,
“సాక్ష్యాలన్నీ బలంగా ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరై వ్యూహాలు రూపొందించారు. ఆ మీటింగ్‌ వీడియో ఫుటేజ్‌ను స్పీకర్‌ సమీక్షించాలని మేము అధికారికంగా అభ్యర్థించాం” అని తెలిపారు. “వీరు రేవంత్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారని ఆధారాలున్నాయి. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ పొందడానికి ట్రిబ్యునల్‌ ద్వారా మేం పిటిషన్‌ వేస్తాం” అని వెల్లడించారు. ఇంకా కొన్ని సాక్ష్యాలను కూడా సమర్పించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

తదుపరి విచారణ వాయిదా

స్పీకర్‌ గద్దం ప్రసాద్‌కుమార్‌ త్వరలో బార్బడోస్‌లో జరిగే స్పీకర్ల అంతర్జాతీయ సమావేశానికి హాజరవుతుండటంతో, విచారణను అక్టోబర్‌ 24కి వాయిదా వేశారు. ఈలోపు మిగతా సాక్ష్యాలు, వీడియోలు, అఫిడవిట్లు సేకరించే అవకాశం బిఆర్ఎస్‌కు లభిస్తోంది.

ఈ కేసు తీర్పు తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది.ఒకవేళ స్పీకర్‌ అనర్హత నిర్ణయం తీసుకుంటే, కాంగ్రెస్‌ శాసనసభలో బలం తాత్కాలికంగా తగ్గుతుంది. మరోవైపు, బిఆర్ఎస్‌కు ఇది రాజకీయ పునరుజ్జీవనానికి మార్గం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సుప్రీం కోర్టు గడువు ప్రకారం అక్టోబర్‌ 30నాటికి స్పీకర్‌ తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఆంతవరకు బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ రెండు వర్గాలు తమ తమ వాదనలను మరింత బలపరచడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈ కేసు ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.