MLA’s Defection Case : ఫిరాయింపు కేసు ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్ మరో షెడ్యూల్

బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కొత్త షెడ్యూల్ జారీ చేశారు. రెండో విడత విచారణ నవంబర్ 6న ప్రారంభం.

MLA’s Defection Case : ఫిరాయింపు కేసు ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్ మరో షెడ్యూల్

విధాత, హైదరాబాద్ : ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో షెడ్యూల్ జారీ చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ మరో మరో నలుగురి పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ జారీ చేశారు. డా. సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లపై ఈ నెల 6, 7, 12, 13 తేదీల్లో విచారణ కొనసాగించనున్నారు. మొదట పిటిషనర్లకు..తర్వాత ప్రతివాదుల క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. రోజుకు ఇద్దరు చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో దానం నాగేందర్ (ఖైరతాబాద్), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), కాలే యాదయ్య (చేవెళ్ల), సంజయ్ కుమార్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల) ఉన్నారు. వారిలో ఇప్పటికే తొలి విడత విచారణ ప్రక్రియలో నలుగురు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ లను రెండు దఫాలుగా స్పీకర్ విచారించారు.

మిగిలిన 6గురు ఎమ్మెల్యేల్లో డా. సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీలను రెండో విడతలో విచారణ నిర్వహిస్తారు. అయితే స్పీకర్ నోటిసులకు సమాధానం ఇవ్వని కడియం శ్రీహరి, దానం నాగేందర్ ల వ్యవహారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు ఆక్టోబర్ 31తో ముగిసిపోయింది. అయితే విచారణ ప్రక్రియకు మరో రెండు నెలల సమయం కావాలని స్పీకర్ ప్రసాద్ సుప్రీంకోర్టుకు నివేదించారు. ఆ వెంటనే రెండో విడత విచారణ షెడ్యూల్ జారీ చేశారు.