Municipal Exit Polls | ఎగ్జిట్ పోల్స్‌ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి!

మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Feb 11, 2026, 8:43 pm IST
Read Time: 3 mins
Municipal Exit Polls | ఎగ్జిట్ పోల్స్‌ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి!

Municipal Exit Polls | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఏడు నగర కార్పోరేషన్లు, 116మున్సిపాల్టీలలో బుధవారం పోలింగ్ ముగిసింది. 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇంతలోనే మున్సిపల్ ఎన్నికలపై పలు సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిని పెంచాయి. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పార్టీనే మెజార్టీ మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులు గెలువబోతున్నదని ఎగ్జిట్ పోల్స్ కథనాలు పేర్కొంటున్నాయి.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 85 స్థానాలు గెలుస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. పల్స్ టుడే సంస్థ ఎగ్జిట్ పోల్స్‌.. కాంగ్రెస్ 83 నుంచి 85 మున్సిపాల్టీలు హస్తగతం చేసుకుంటుందని పేర్కొంది. బీఆర్ఎస్ 23 నుంచి 27వరకు, బీజేపీ 4 నుంచి 5 మున్సిపాల్టీలు, ఎంఐఎం 1 మున్సిపాల్టీ గెలుస్తుందని అంచనా వేసింది.

ఏడు కార్పొరేషన్లలో నిజామాబాద్, కరీంనగర్ బీజేపీ గెలుస్తుందని, నల్లగొండ, మంచిర్యాల, మహబూబ్ నగర్, కొత్తగూడెం, రామగుండం కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది.

పీపుల్స్ సంస్థ కాంగ్రెస్ 68–76 మున్సిపాల్టీల్లో, బీఆర్ఎస్ 29–36, బీజేపీ 3–5, ఇతరులు 8–14 మున్సిపాల్టీల్లో గెలుస్తాయని అంచనా వేసింది. ఏడు కార్పొరేషన్లలో నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ, మిగతా చోట్ల కాంగ్రెస్ గెలవబోతుందని అంచనా వేసింది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జనవరి 2020లో జరిగిన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల ఎన్నికల్లో బీఆర్ఎస్ 112 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది.