కేరళంలో కమ్యూనిస్టులకు షాక్‌? యూడీఎఫ్‌దే ఆధిక్యమన్న పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌

పదేళ్లు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్‌కు మరోసారి అవకాశం లేదని పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొంటున్నాయి. ఈసారి అక్కడ యూడీఎఫ్‌ అధికారంలోకి వచ్చే చాన్స్‌ ఉందని అంచనా వేశాయి.

  • By: TAAZ |    national |    Published on : Apr 29, 2026 7:08 PM IST
కేరళంలో కమ్యూనిస్టులకు షాక్‌? యూడీఎఫ్‌దే ఆధిక్యమన్న పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌

కేరళంలో పదేళ్ల తర్వాత మళ్లీ యూడీఎఫ్‌ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమికి 75 నుంచి 85 సీట్లు రావచ్చని పేర్కొంది. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 మంది సభ్యులు ఉంటారు. ఇందులో సీపీఎం నేతృత్వలోని వామపక్ష సంఘటన (ఎల్డీఎఫ్‌) 55 నుంచి 65 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఎల్డీఎఫ్‌కు ఆధిక్యం తగ్గినా.. తనకు గట్టి పట్టున్న ప్రాంతాలను నిలుపుకొనే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అందరూ ఊహించిన విధంగానే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు కనిష్ఠంగా ‘0’ నుంచి గరిష్ఠంగా 3 సీట్లు రావచ్చని పేర్కొన్నాయి.

ఎల్డీఎఫ్‌కు ఇంకా పాలనాపరంగా ఇంకా విశ్వసనీయత ఉందని, దాని నాయకత్వం కూడా బలంగానే ఉందని ఎగ్జిట్ పోల్‌ సర్వే పేర్కొంటున్నది. అయితే.. పదేళ్లు వరుసగా అధికారంలో ఉన్న నేపథ్యంలో ఓటర్లు మార్పు కోరుకొని ఉండొచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొంటున్నాయి. అందుకే యూడీఎఫ్‌కు ఏకపక్షంగా ఓటింగ్‌ కాలేదని, కానీ నిర్ణయాత్మకంగా ఓటింగ్‌ జరిగిందని చెబుతున్నాయి.